బ్రెజిల్‌లో కొత్త వైరస్‌ ‘యారా’ | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌లో కొత్త వైరస్‌ ‘యారా’

Published Wed, Feb 12 2020 6:50 PM

Scientists Discover Mysterious Virus YARA In Brazil - Sakshi

బ్రెసిలియ : బ్రెజిల్‌లోని ఓ కత్రిమ సరస్సులో సరికొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి బ్రెజిల్‌ పురాణంలో ఉన్న మత్యకన్య ‘యారా’ పేరు పెట్టారు. ఇప్పటి వరకు కనుగొన్న వైరస్‌లకు ఈ వైరస్‌కు ఎలాంటి పోలిక లేకపోవడమే కాకుండా పూర్తి భిన్నంగా ఉండడం పట్ల శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్స్‌ ఫెడరల్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ మినా జెరాయిస్‌ నాయకత్వంలోని పరిశోధన బందం యారావైరస్‌ జన్యు క్రమాన్ని విశ్లేషించింది.ఈ వైరస్‌లో మొత్తం 74 జన్యువులు ఉండగా, అందులో 68 జన్యువులను తాము ఇంతవరకు ఏ వైరస్‌లో చూడలేదని, అందుకని వాటికి అనాథ జన్యువులుగా వ్యవహరిస్తున్నామని జెరాయిస్‌ తెలిపారు. గ్లోబల్‌ సైంటిఫిక్‌ డేటాలోని 8,500 రకాల జన్యువులతో పోల్చి చూసినా ఎక్కడా పోలిక దొరకలేదని ఆయన చెప్పారు. నేడు కరోనావైరస్‌ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త వైరస్‌ వెలుగులోకి రావడం విశేషమే.


బ్రెజిల్‌లోని బెలో హారిజాంటే నగరంలోని ఓ కత్రిమ సరస్సు నీటిలోని ఏకకణ జీవి అమీబాలో దీన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ఏక కణ జీవి అమీబాల్లోనే ఈ వైరస్‌ కనిపిస్తున్నందున,మనుషులకు సోకే ప్రమాదం లేకపోవచ్చని జెరాయిస్‌ అభిప్రాయపడ్డారు.ప్రపంచంలోని సముద్రాల్లో గతంలో 15,222 రకాల వైరస్‌లను కనుగొనగా గత 2016 నుంచి 2019 మధ్య మూడేళ్ల కాలంలోనే దాదాపు 1,80,000 రకాల వైరస్‌లను కనుగొన్నారు. వాటితో నీటిలో నివసించే వైరస్‌లు 1,95,728కు చేరుకున్నాయి. బహూశ సముద్ర జలాలు కలుషితం అవుతుండడం వల్ల వైరస్‌లు పెరిగి ఉండొచ్చేమో!

Advertisement
Advertisement