కొరియాకు వెళ్లనివ్వండి.. కిమ్‌ను కూల్‌ చేస్తా! | Sakshi
Sakshi News home page

కొరియాకు వెళ్లనివ్వండి.. కిమ్‌ను కూల్‌ చేస్తా!

Published Tue, Dec 12 2017 7:49 PM

send me back to North Korea i can cool tensions : Dennis Rodman - Sakshi

బీజింగ్‌ : ‘‘ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి.. ఇప్పుడున్న ఉద్రిక్తతను తప్పకుండా తగ్గిస్తాను. అమెరికాపై ఆటంబాంబులు వేస్తానంటోన్న కిమ్‌ జాంగ్‌ను కూల్‌ చేస్తాను. ఇంతకుముందులాగే ఆయనతో కలిసి తాగి, తిని, ఆడి, పాడి నచ్చచెబుతాను..’’ అంటున్నారు ప్రముఖ స్పోర్ట్స్‌పర్సన్‌, వెటరన్ బాస్కెట్‌బాల్‌ స్టార్‌ డెన్నిస్‌ రాండ్‌మన్‌. ఉత్తరకొరియా నియంత నేతను వ్యక్తిగతంగా కలుసుకున్న అతికొద్ది మంది విదేశీయులు.. అందులోనూ అమెరికాకు చెందినవాడిగా డెన్నిస్‌కు ప్రత్యేకత ఉంది.

ఆసియాలో బాస్కెట్‌బాల్‌ క్రీడకు ప్రచారం కల్పించడంలో భాగంగా డెన్నిస్‌... 2013లో మొట్టమొదటిసారి ఉత్తరకొరియా వెళ్లి కిమ్‌ జాంగ్‌ను కలుసుకున్నారు. నాడు గంటలపాటు సాగిన భేటీలో ఇరువురూ వైన్‌ తాగుతూ, భోజనం చేస్తూ, సంగీతాన్ని ఆస్వాదిస్తూ పలు అంశాలపై ముచ్చటించారు. సరిగ్గా అదే సమయంలో కొరియా బందీగా ఉన్న అమెరికన్‌ విద్యార్థి విడుదల కావడంతో డెన్నిస్‌ గొప్ప రాయబారిగా కీర్తిపొందాడు. కానీ నిజానికి బందీ విడుదల కోసం తాను చేసిందేమీలేదని తర్వాతికాలంలో డెన్నిస్‌ చెప్పుకొచ్చారు. చివరిగా గత జూన్‌లో ఆయన కొరియాలో పర్యటించారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే..

మరోసారి ఆసియా పర్యటన చేస్తోన్న డెన్నిస్‌​ రాండ్‌మన్‌.. టోక్యో, బీజింగ్‌ తదితర నగరాల్లో బాస్కెట్‌బాల్‌కు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం బీజింగ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆరోసారి ఉత్తరకొరియా వెళ్లాలన్న కోరికను వెలిబుచ్చారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉత్తరకొరియా వెళ్లేందుకు అమెరికా తన పౌరులను అనుమతించడం లేదు. అందుకే మా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఒక మనవి చేస్తున్నాను. ఒక్కసారి నన్ను కొరియా వెళ్లనివ్వండి.. కిమ్‌తో మాట్లాడి, అతన్నికూల్‌చేసి, యుద్ధభయాలను తగ్గించే ప్రయత్నం చేస్తాను’’ అని డెన్నిస్‌ రాండ్‌మన్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement