అమెరికాలో సీరియల్ రేపిస్టులు కామన్ | Sakshi
Sakshi News home page

అమెరికాలో సీరియల్ రేపిస్టులు కామన్

Published Wed, Jun 8 2016 7:20 PM

రికార్డు చేసిన రేప్ కిట్ల - Sakshi

అమెరికాలో ఇంతకుముందు ఊహించిన దానికన్నా సీరియల్ రేపిస్టులు ఎక్కువగా కనిపిస్తున్నారు. సీరియల్ రేపిస్టులు చాలావరకు ముక్కూ మొహం తెలియని వారినే టార్గెట్ చేస్తారు. బాధితులను కిడ్నాప్ చేసి, ఈ అకృత్యాలకు పాల్పడతారు. ఎక్కువ మంది సీరియల్ రేపిస్టులు వాహనాల్లోనే ఈ అఘాయిత్యాలకు పాల్పడతారు. కొంతమంది మాత్రం తమ ఇంట్లో లేదా బాధితురాలి ఇంట్లో రేప్‌లకు పాల్పడతారు. రేప్ సందర్భంగా వారు బాధితులను చెంప మీద కొట్టడం, కుదేయడం లాంటి హింసాత్మక చర్యలకు పాల్పడతారు. దాదాపు వారందరికీ హింసాత్మక నేరచరిత్రే ఉంటుంది. వారు గ్యాంగ్ రేప్‌లకు పాల్పడటం తక్కువ.

1993 నుంచి 2010 వరకు దాదాపు 17 ఏళ్లకు సంబంధించిన కేసుల్లోని రేప్ కిట్లను అధ్యయనం చేయడం ద్వారా ఒహాయో నిపుణులు ఈ అంశాలను విశ్లేషించారు. నేరస్తులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించేందుకు బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా 'రేప్ కిట్ల'ను రికార్డు చేసి పెడతారు. దీనికోసం 'కుయాహోగా కౌంటీ సెక్సువల్ అసాల్ట్ కిట్ టాస్క్ ఫోర్స్' అనే సంస్థ కూడా ఉంది. ఒహాయోలోని 'వెస్టర్న్ రిజర్వ్ యూనివర్శిటీ, బెగాన్ సెంటర్ ఫర్ వాయలెన్స్ ప్రివెన్షన్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్'తో కలసి ఈ పాత రేప్ కిట్లను విశ్లేషించింది.

ఈ మొత్తం 17 ఏళ్ల కాలంలో జరిగిన అన్ని రేప్ కేసులను అధ్యయనం చేయడం ద్వారా అందులో 51 శాతం మంది సీరియల్ రేప్‌లకు పాల్పడిన విషయం తేలిందని విశ్లేషకులు తెలిపారు. ఈ మొత్తం కేసుల్లో 250 మంది నేరస్థులకు శిక్షలు పడగా, మిగతా కేసులు ప్రాసిక్యూషన్ దశలో ఉన్నాయని వారు తెలిపారు. సీరియల్ రేపిస్టుల కేసులను విడిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందనే విషయం తమకు ఈ అధ్యయనం ద్వారా తేలిందని వారు చెప్పారు. సీరియల్ రేపిస్టులు అరెస్టుకు ముందు, ఆ తర్వాత కూడా రేప్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సీరియల్ రేపిస్టుల్లో 75 శాతం మంది రేప్ కేసుకన్నా ముందే అరెస్టయిన సందర్భాలు ఉండగా, రేప్ తర్వాత అరెస్టయిన సందర్భాలు 95 శాతం ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. సీరియల్ రేపిస్టులను ముందుగానే అరెస్ట్ చేయడం ద్వారా వారి భవిష్యత్ రేప్‌లను అరికట్టే అవకాశం ఉంటుందని వారు చెప్పారు.

Advertisement
Advertisement