అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

Published Mon, Aug 22 2016 9:01 AM

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం - Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. ఒక ఇంట్లో ఇస్తున్న పార్టీలో ఇద్దరు వ్యక్తులు చొరబడి విచ్చలవిడిగా కాల్చడంతో 13 మంది గాయపడ్డారు. పార్టీకి వెళ్తున్న సుమారు 100 మందిపై ఇద్దరు షూటర్లు వెనకనుంచి కాల్పులు జరిపినట్లు బ్రిడ్జిపోర్టు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పార్టీకి జనం బాగా ఎక్కువగా రావడంతో.. కొంతమంది ఈ తుపాకి కాల్పులను టపాసుల కాల్పులు అనుకున్నారు.

పోలీసులు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచి.. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. కాల్పులకు కారణం ఏంటో మాత్రం ఇంతవరకు తెలియలేదు. పార్టీకి వచ్చినవాళ్లలోనే ఎవరైనా కాల్పులు జరిపారా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నిందితులను వీలైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు చీఫ్ అర్మాండో జె పెరెజె తెలిపారు. క్షతగాత్రులలో ఐదుగురు తప్ప మిగిలిన అందరికీ ప్రాథమిక చికిత్స చేసి పంపేశారు.

చాలామందికి కాళ్లలోనే గాయాలయ్యాయి. ఒక్కమహిళకు మాత్రం ముఖంమీద, దవడ మీద బుల్లెట్ గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. బాధితులంతా 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసువారేనని పోలీసులు తెలిపారు. అసలు పార్టీ ఎవరిచ్చారన్న విషయం కూడా ఇంకా తెలియలేదు. పార్టీలో మద్యం అమ్మేందుకు అనుమతి కోరినా.. అందుకు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా అక్కడ మద్యం అమ్మారని, అందుకు వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అంటున్నారు.

Advertisement
Advertisement