అమెరికాలో కాల్పుల కలకలం.. | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం..

Published Mon, Mar 27 2017 2:57 AM

అమెరికాలో కాల్పుల కలకలం.. - Sakshi

సిన్సినాటీ నైట్‌ క్లబ్‌లో కాల్పులు
ఒకరు మృతి.. మరో 15 మందికి గాయాలు
లాస్‌వేగాస్‌లో బస్సులో కాల్పులు.. ఒకరి మృతి


సిన్సినాటీ(అమెరికా): అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి విజృంభించింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు మరణించగా.. మరో 16 మంది గాయాలపాలయ్యారు. సిన్సినాటీ లోని కేమియో నైట్‌ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయం లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వీకెండ్‌ కావడంతో కిక్కిరిసిన నైట్‌క్లబ్‌లో ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఒకరు మరణించగా.. 15 మంది గాయపడ్డారు.

ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు లేవని అసిస్టెంట్‌ పోలీస్‌ చీఫ్‌ పాల్‌ న్యూడిగేట్‌ చెప్పారు. కాల్పులకు గల కారణాలు తెలియలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నా మన్నారు. ఈ ఘటనకు సంబంధించి నింది తులెవరినీ పోలీసులు అరెస్ట్‌ చేయలేదన్నారు. కాల్పులకు పాల్పడింది ఒకే దుండగుడని సమాచారం అందిందని, ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే దానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తి ఎవరనేది గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. నైట్‌ క్లబ్‌లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెపుతున్నారు.

బస్సులో ఘాతుకం..
అమెరికాలో టూరిస్ట్‌ స్పాట్‌ లాస్‌వేగాస్‌లో మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో బస్సులోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. అనంతరం దుండగుడు పోలీసులకు లొంగిపోయాడు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో కాస్మోపాలిటన్‌ హోటల్‌ క్యాసినో సమీపంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. హైడ్రామా నడిచిన తర్వాత సుమారు 3.30 గంటల సమయంలో దుండగుడు తన వద్ద ఉన్న హ్యాండ్‌ గన్‌తో పాటు లొంగిపోయాడని లాస్‌వెగాస్‌ పోలీస్‌ అధికారి ల్యారీ హాడ్‌ఫిల్డ్‌ చెప్పారు. ఒకే వ్యక్తి ఉండటంతో దీనికి ఉగ్రవాద సంబంధాలు ఉండే అవకాశాలు లేవని చెప్పారు.

Advertisement
Advertisement