మైనస్ 30 డిగ్రీల్లో...ఓ అరవై రోజులు | Sakshi
Sakshi News home page

మైనస్ 30 డిగ్రీల్లో...ఓ అరవై రోజులు

Published Sun, Sep 25 2016 11:55 AM

మైనస్ 30 డిగ్రీల్లో...ఓ అరవై రోజులు

ఏదైనా చల్లని ప్రదేశానికి ఇలా వెళ్తామో లేదో.. నిమిషాల వ్యవధిలో  గజగజ వణకడం మనకి సహజం.  దూరం నుంచి మంచు ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ దగ్గరికెళ్తే ఎముకల్ని సైతం కొరికెయ్యగలదు. అందుకే  అలాంటి ప్రాంతాలు ఆవాసయోగ్యంగా ఉండవు. కానీ, యూరప్‌లాంటి దేశాల్లో మంచు తిప్పలు సాధారణం. ఇలా దట్టంగా మంచు కురుస్తున్నా తన కారును ముందుకే పోనిచ్చాడు స్వీడన్‌కు చెందిన పీటర్ స్కిల్‌బర్గ్. ప్రయాణం సాగించిన ఈయన ఉత్తర స్వీడన్‌లోని ఉమియా పట్టణానికి కూతవేటు దూరంలో ఉండగా మంచు దిబ్బల మధ్య ఇరుక్కుపోయాడు. కొద్దిసేపటికి వాతావరణం మారుతుందనుకుని కారులోనే ఉండిపోయాడు.

అనూహ్యంగా మంచువాన ఎక్కువైంది. కారు నుంచి వెలుపలికి అడుగుపెడితే ఎముకలు కొరికేసే మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత! దీంతో కారులోనే గడిపేశాడు.వెంట తెచ్చుకున్న కొద్దిపాటి స్నాక్స్‌తో కాలక్షేపం చేస్తూ కూర్చున్నాడు. ఎలా గడిచాయో ఏమోగాని రెండు నెలలు అలా గడిచిపోయాయి. స్కిల్‌బర్గ్ కారు మంచు దిబ్బల మధ్య బయటివారికి కనిపించకుండా పోయింది. ఆయన కూడా దీర్ఘ నిద్రలోకి జారుకున్నాడు. చివరకు జనవరిలో కొందరు ఆయనను కారు నుంచి బయటకు తీసేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అత్యంత ప్రమాదకరమైన స్థితి నుంచి అతడు బతికి బట్టకట్టడం వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. నిజమే రెండు నెలల పాటు అంత దట్టమైన మంచులో ఎలా ప్రాణాలు నిలబెట్టుకున్నాడో అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

Advertisement
Advertisement