నత్త గుడ్లతో కేన్సర్‌కు విరుగుడు | Sakshi
Sakshi News home page

నత్త గుడ్లతో కేన్సర్‌కు విరుగుడు

Published Thu, May 19 2016 3:13 AM

నత్త గుడ్లతో కేన్సర్‌కు విరుగుడు

చికిత్సకు లొంగని మొండి కేన్సర్లకు మరో విరుగుడును ఆవిష్కరించారు ఆస్ట్రేలియాలోని ఊలన్‌గాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర తీర ప్రాంతాల్లో కనిపించే ఒకరకమైన నత్త గుడ్ల నుంచి సేకరించిన రసాయనం కేన్సర్ కణాలను నాశనం చేస్తున్నట్లు గుర్తించారు. చాలా రకాల బ్లడ్ కేన్సర్లు, కణితులు కీమోథెరపీ ద్వారా తగ్గుముఖం పడతాయి. అయితే అయితే ఛాతీ, గర్భాశయ, క్లోమ గ్రంథులకు సోకే కేన్సర్లు మాత్రం కీమోథెరపీ చికిత్సకు లొంగవు. ఇలాంటి కేన్సర్ కణాలను నత్త గుడ్లలోని ఎన్-ఆల్కలెసాటిన్స్ అనే రసాయనం 48 గంటల్లోనే పూర్తిగా నాశనం చేస్తాయని కారా పెర్రో అనే శాస్త్రవేత్త తెలిపారు. కీమోథెరపీ ద్వారా 10 శాతం కేన్సర్ కణాలే నాశనం అవుతాయని పేర్కొన్నారు. ఈ రసాయనం గురించి 2002లోనే తెలిసినా నత్తగుడ్ల నుంచి సేకరించడం మాత్రం ఇదే తొలిసారని చెప్పారు.

 కేన్సర్ కణాల్లో ఉండే అతి సూక్ష్మమైన మైక్రోట్యూబ్యూల్స్‌పై దాడి చేయడం ద్వారా ఇవి పనిచేస్తాయని వివరించారు. అన్నీ సవ్యంగా జరిగితే మరో ఐదేళ్లలో ఎన్-ఆల్కలైసాటిన్స్‌తో కేన్సర్ చికిత్స మందులు అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement