శభాష్‌ సోషల్ మీడియా! | Sakshi
Sakshi News home page

శభాష్‌ సోషల్ మీడియా!

Published Sat, Nov 14 2015 1:15 PM

శభాష్‌ సోషల్ మీడియా! - Sakshi

నగరంలో శుక్రవారం రాత్రి టెర్రరిస్టులు సృష్టించిన మారణకాండపై టీవీ ఛానళ్ల కన్నా సోషల్ మీడియా వేగంగా స్పందించింది. రక్తపాతాన్ని ప్రత్యక్షంగా చూసిన సోషల్ మీడియా యూజర్లు తమకు తెలిసిన సమాచారాన్ని వెను వెంటనే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. విద్వేషపూరిత సందేశాలకు అవకాశం ఇవ్వకుండా బహూశా తొలిసారి బాధ్యతాయుతంగా సోషల్ మీడియా వ్యవహరించింది. విద్వేషంతో విడిపోవడం కన్నా ప్రేమతో కలిసుందామన్న సందేశాలు వెల్లువెత్తాయి.

టెర్రరిస్టుల దాడుల అనంతరం వీధులన్నింటినీ తక్షణం ఖాళీ చేయాలన్న భద్రతాదళాల హెచ్చరికలతో ఎక్కడికెళ్లాలో తెలియక నిశ్చేష్టులైన బాటసారులకు సోషల్ మీడియా చేయూతనిచ్చింది. ‘మా ఇంటికి రండి, ఆశ్రయిస్తాం’ అంటూ పర్షియన్ పౌరులు ముందుగా సోషల్ మీడియాలో స్పందించారు. అనంతరం ‘మా ఇంట్లో ఐదారుగురు నిద్రించేందుకు చోటుంది, రండి'.. అంటూ కొందరు, ముస్లిం మిత్రులకు కూడా చోటుందని ఇంకొందరు, 'సమీపంలో గురుద్వారా ఉంది. అక్కడికెళ్లండి. ఖల్సా ఉన్నదే మీ రక్షణ కోసం... భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడు గాక...’ అంటూ మరికొందరు సోషల్ మీడియాలో స్పందించారు.

ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’ యాజమాన్యం కూడా ‘సేఫ్టీ చెక్’ ఫీచర్‌తో సకాలంతో స్పందించింది. ‘మీ బంధుమిత్రులు ఎక్కడున్నారో, ముందుగా గుర్తించండి... వారి యోగక్షేమాలు కనుక్కోండి! వారు క్షేమంగా ఉంటే సేఫ్‌గా ఉన్నట్టు మార్క్ చేయండి’ అంటూ సందేశాలు పంపింది.

టెర్రరిస్టుల కాల్పుల్లో వందమందికి పైగా మరణించిన బెటాక్లాన్ మల్టీపర్పస్ థియేటర్ పరిస్థితి గురించి సోషల్ మీడియా ఎప్పటికప్పుడు తెలియజేసింది. కాల్పులకు ముందు, కాల్పులు కొనసాగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా వేగంగానే స్పందించింది. థియేటర్‌లోకి టెర్రరిస్టులు జొరబడి కాల్పులు ప్రారంభించినప్పుడు అందులో దాదాపు 1500 మంది ప్రేక్షకులు ఉన్నారు. టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. గేట్లు పూర్తిగా మూసేస్తున్నామన్న ప్రకటన వెలువడిన కొన్ని క్షణాలకే కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముందుగా పైనున్న ఫ్యాన్లు, లైట్లపై అత్యాధునిక తుపాకులతో కాల్పులు జరిపిన ముష్కరులు, ఆ తర్వాత ప్రేక్షకుల పైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఆ సమయంలో కాలిఫోర్నియాకు చెందిన ‘ఈగల్స్' అనే రాక్ బ్యాండ్ ఆఫ్ ది డెత్ మెటల్ అనే థీమ్‌తో కచేరీ నిర్వహిస్తోంది. టెర్రరిస్టుల కాల్పుల్లో రాక్ బ్యాండ్‌కు చెందిన కళాకారులెవరూ గాయపడలేదు. కాల్పులకు ముందు కనిపించిన ఉల్లాస వాతావరణం, కాల్పుల తర్వాత కనిపించిన విషాద వాతావరణానికి సంబంధించిన ఫొటోలను పలువురు యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Advertisement
Advertisement