సొంత సైనికుడిపైనే కిమ్‌ సేన బుల్లెట్ల వర్షం | Sakshi
Sakshi News home page

పారిపోతున్న సైనికుడిపై ఉత్తర కొరియా సైన్యం కాల్పులు

Published Tue, Nov 14 2017 3:35 PM

Solider Defection North Korea Solider Shot - Sakshi

సియోల్‌ : తమ దేశం నుంచి పారిపోతున్న సైనికుడిపై ఉత్తర కొరియా సైన‍్యం విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. అయితే చివరకు ఎలాగోలా అతను దక్షిణ కొరియా సరిహద్దుకు చేరుకోగా.. అతన్ని కాపాడిన అధికారులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

పన్‌ మున్‌ జామ్‌ అనే గ్రామం ఉత్తర, దక్షిణ కొరియాలకు సరిహద్దుగా ఉంది. ఇది పర్యాటక ప్రాంతం కూడా. సోమవారం సాయంత్రం ఓ సైనికుడు వాహనంలో దక్షిణ కొరియా వైపుగా దూసుకొచ్చాడు. అయితే అతన్ని వెంబడించిన ఉత్తర కొరియా సైనిక దళాలు తుటాల వర్షం కురిపించాయి. సోమవారం సెలవు రోజు కావటంతో పర్యాటకులు లేకపోవటం.. తద్వారా భారీ ప్రాణ నష్టం తప్పినట్లయ్యింది. 

సుమారు 40 రౌండ్లు కాల్పులు జరపగా.. ఐదు బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకుపోయాయి. చివరకు వాహనం నుంచి కింద పడిపోయిన అతను పాకుతూనే దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాడు. గస్తీ బాధ్యతలు నిర్వర్తించే యునైటెడ్‌ నేషన్స్‌ కమాండ్‌ (యూఎన్‌సీ) సిబ్బంది దీనిని గమనించి, హెలికాప్టర్‌ లో అతడిని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఒప్పందం ఉండటంతో తాము తిరిగి కాల్పులు చేపట్టలేకపోయామని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు.

కాగా, కిమ్‌ ఆరాచకాలపై ఆ దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా..  ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలీనీయకుండా కిమ్‌ నియంత పాలన కొనసాగిస్తున్నాడు. దీనికి తోడు అమెరికాతో యుద్ధానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజల్లో భయం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే పలువురు చైనా గుండా ఇతర దేశాలకు వలస వెళ్తుండగా.. ఇప్పుడు ఇలా సొంత  సైనికుడు దేశం వదిలి పారిపోయే పరిస్థితికి చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని దక్షిణ కొరియా చెబుతోంది. మరోపక్క ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తునకు ఆదేశించింది.

Advertisement
Advertisement