పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన శ్రీలంక | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన శ్రీలంక

Published Fri, Sep 30 2016 4:29 PM

పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన శ్రీలంక - Sakshi

కొలంబో: టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్‌కు తాజాగా శ్రీలంక కూడా షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ వేదికగా ఇస్లామాబాద్లో జరగనున్న సార్క్ సమావేశాలకు వెళ్లకూడదని శ్రీలంక నిర్ణయించింది. ఈ మేరకు లంక విదేశాంగ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన చేసింది. దీంతో ఇప్పటివరకూ సార్క్ సదస్సుకు గైర్హాజరు అవుతున్న దేశాల సంఖ్య అయిదుకు చేరింది. తీవ్రవాదంపై పోరులో భారత్‌కు బాసటగా నిలిచిన బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్ దేశాలు సార్క్ సమ్మిట్కు హాజరయ్యేది లేదని స్పష్టం చేశాయి. నవంబర్ 9, 10 తేదీలలో పాకిస్థాన్ రాజధాని  ఇస్లామాబాద్‌ వేదికగా సార్క్ సమ్మిట్ జరుగనున్న విషయం తెలిసిందే.

కాగా ప్రేరేపిత ఉగ్రవాదం, హింసను వ్యతిరేకించడంతో పాటు తాజా పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే ప్రయత్నంలో తొలి అడుగుగా సార్క్ దేశాల స్థాయిలో ఆ మేరకు భారత్ విజయం సాధించినట్లుగానే భావించవచ్చు.

అయితే సదస్సుకు తాము హాజరయ్యేది లేదని అయిదు దేశాలు స్పష్టంగా చెప్పినా.. ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ మాత్రం.. సరైన సమయానికే ఈ సదస్సు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సభ్యదేశాలన్నీ సహకరించాలని గట్టిగా కోరింది. భారత్తో పాటు వరుసపెట్టి బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్ కూడా వివిధ కారణాలతో తాము ఇస్లామాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరు కాబోమని తెలిపాయి.

దాంతో ఇక ఆతిథ్య దేశం పాకిస్థాన్‌తో పాటు కేవలం మాల్దీవులు, నేపాల్ మాత్రమే ఆ సదస్సులో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. నేపాల్ సార్క్ అధ్యక్ష హోదాలో ఉన్నందున వెళ్లకుండా ఉండలేదు. అలాగే మాల్దీవుల నిర్ణయం ఇంకా తెలియాల్సి ఉంది.  అయితే అసలు ఏ ఒక్క సభ్య దేశం రాకపోయినా సదస్సు వాయిదా వేయాల్సిందే.

Advertisement
Advertisement