‘విదేశాల్లో చదివొచ్చి.. ఇక్కడ రక్తం పారిస్తున్నారు’

24 Apr, 2019 18:56 IST|Sakshi

కొలంబో : క్రైస్తవ ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా శ్రీలంకలో ఐసిస్‌ ఉద్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు తెగబడటంతో 359 మంది అసువులుబాసారు. వేలమంది క్షతగాత్రులయ్యారు. స్థానిక ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ ఈ మారణహోమానికి పాల్పడినట్టు తొలుత భావించారు. అయితే, గత నెల 15న న్యూజిలాండ్‌లో జరిగన మసీదు దుర్ఘటనకు ప్రతీకారంగానే ఈస్టర్‌ పండుగ వేళ తమ ప్రతీకారాన్ని తీర్చుకున్నామని ఐసిస్‌ ఉగ్రసంస్థ వెల్లడించింది. బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉండటం.. అంతా లంకేయులే కావడం గమనార్హం. ఇక విదేశాల్లో ఉన్నత చదువుసాగించిన విద్యావంతులు ఉగ్రవాదంవైపు మళ్లడం ద్వీపదేశాన్ని మరింత కలవరపెడుతోంది.

బాగా చదువుకొని అటు కుంటుంబాన్ని ఇటు దేశాన్ని ఉద్ధరిస్తారనుకున్న ‘మేధావులు’ పుట్టిన గడ్డపై రక్తం పారిస్తున్నారని రక్షణశాఖ సహాయమంత్రి రువాన్‌ విజయవర్దనే ఆవేదన వ్యక్తం చేశారు. పదిమందికి తిండి పెడతారనుకున్న ఐశ్వర్యవంతులు ప్రజల ఉసురు తీస్తున్నారని వాపోయారు. ఆత్మాహుతి దాడులకు తెగబడ్డవారిలో యూకే, ఆస్ట్రేలియాలో పీజీ పూర్తి చేసిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడని తెలిపారు.  చదువుల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అతను ఉగ్రవాదం ఆకర్షితుడయ్యాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇక బడా వ్యాపారవేత్త మహమ్మద్ యూసుఫ్‌ ఇబ్రహీం ఇద్దరు కుమారులు కూడా సూసైడ్‌ బాంబర్లుగా మారారు. 33 ఏళ్ల ఇమ్సాత్‌ కొలంబోలోని సిన్నమన్‌ గ్రాండ్‌ హోటల్‌లో, 31ఏళ్ల ఇల్హామ్‌.. షాంగ్రిల్లా హోటల్‌లో పేలుళ్లకు తెగబడినట్టు వెల్లడైంది. 

దాడులకు సంబంధించి ఇప్పటివరకు 90 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈస్టర్‌ సండే రోజు వరుస దాడులతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పోలీసులు, త్రివిధ దళాలు ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు