రష్యా రైల్లో ‘ఉగ్ర’ పేలుడు | Sakshi
Sakshi News home page

రష్యా రైల్లో ‘ఉగ్ర’ పేలుడు

Published Tue, Apr 4 2017 1:49 AM

రష్యా రైల్లో ‘ఉగ్ర’ పేలుడు

9 మంది మృతి.. 20 మందికి గాయాలు
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నడుస్తున్న రైల్లో దుశ్చర్య


మరో ఘటనలో రైల్వే స్టేషన్‌లో పేలుడు పదార్థం.. నిర్వీర్యం చేసిన పోలీసులు
- పేలుడు సమయంలో నగరంలో అధ్యక్షుడు పుతిన్‌
- బాధిత కుటుంబాలకు మోదీ సంతాపం


సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: రష్యాలో రెండో అతిపెద్ద నగరమైన సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సోమవారం బాంబు పేలుడుతో అదిరిపడింది. నగరం నడిబొడ్డున ప్రయాణిస్తున్న సబ్‌వే మెట్రో రైల్లో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాద దాడి కావొచ్చని అనుమానిస్తున్నారు. టెక్నాలజిచెస్కీ ఇన్‌స్టిట్యూట్, సెన్నాయా స్క్వేర్‌ స్టేషన్ల మధ్య సొరంగ మార్గంలో వెళ్తున్న రైల్లోని ఓ బోగీలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:40 గంటలకు పేలుడు జరిగింది. డ్రైవర్‌ రైలును సొరంగంలో ఆపకుండా పక్క స్టేషన్‌కు తీసుకెళ్లి నిలిపేశాడు. దీంతో ప్రాణనష్టం భారీగా తప్పిందని అధికారులు చెప్పారు.

పేలుడు ధాటికి బోగీ తలుపు ధ్వంసమైంది. స్టేషన్‌లో రక్తసిక్త మృతదేహాలతోపాటు పలువురు గాయాలతో నెత్తురోడుతూ, సాయం కోసం అర్థిస్తూ కనిపించారు. క్షతగాత్రుల్లో పలువురు బాలలు ఉన్నారు. ఇప్పటివరకు 9 మంది చనిపోయారని, క్షతగాత్రుల్లో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రతినిధి ఒకరు చెప్పారు. బోగీలో ఓ వ్యక్తి సూట్‌కేసును వదిలిపెట్టి పక్క బోగీ ఎక్కాడని, తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలోనే సూట్‌కేస్‌ వదలిపెట్టిన బోగీలో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రైల్లో బాంబు పెట్టినట్లు భావిస్తున్న వ్యక్తి ఫొటోను పోలీసులు విడుదల చేశారు.  మరోపక్క.. నగరంలోని వోస్తానియా స్క్వేర్‌ అనే మరో మెట్రో స్టేషన్‌లో పేలుడు పదార్థం దొరికింది. భద్రతా సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేశారు.

అంతకుముందు.. మాస్కో ప్రజా రవాణా వ్యవస్థపై దాడుల కోసం ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని భద్రతా వర్గాలు చెప్పాయి.  సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని అన్ని మెట్రోస్టేషన్లను మూసేసి ప్రయాణికులను ఖాళీ చేయించారు. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. బెలారస్‌ అధ్యక్షుడితో చర్చల కోసం నగరానికి వచ్చిన సమయంలో ఈ పేలుడు జరిగింది. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ పుతిన్‌ స్వస్థలం. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. పేలుళ్లకు కారణం ఇంకా తెలియలేదని, ఇది ఉగ్రవాద దాడా, మరో దాడా అన్నది దర్యాప్తులో తేలుతుందని, మొదట ఉగ్రదాడి కోణంలో దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఉగ్రదాడి అనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నట్లు రష్యా దర్యాప్తు కమిటీ కూడా పేర్కొంది. పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని మాస్కోలోని మెట్రో నెట్‌వర్క్‌కు భద్రతను పటిష్టం చేశారు. దేశవ్యాప్తంగా రవాణా కూడళ్లలో నిఘా పెంచారు.

ఢిల్లీలో హైఅలర్ట్‌: రష్యా పేలుడు నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో హైఅలర్ట్‌ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులను చేతులతో తడిమి తనిఖీ చేశారు. సాధారణ భద్రతను పటిష్టం చేయాలని మెట్రో రక్షణ బాధ్యతలు చూస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) సంబంధిత సిబ్బందిని ఆదేశించింది. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్వీట్‌ చేశారు.

గతంలోనూ దాడులు..
రష్యాలో ప్రజా రవాణా వ్యవస్థలపై గతంలోనూ దాడులు జరిగాయి. 2013లో వోల్గోగ్రాడ్‌లో ఆత్మాహుతి దాడు ల్లో 34 మంది బలయ్యారు. 2011లో మాస్కో విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడిలో 34 మంది చనిపోయారు. చెచెన్యా తిరుగుబాటుదారులతోపాటు పలు ఉగ్ర సంస్థలు రష్యాలో దాడులకు తెగబడుతున్నాయి. గత నెల 24న చెచెన్యాలోని నేషనల్‌ గార్డ్‌ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు రష్యన్‌ సైనికులు చనిపోయారు. సిరియాలో ఐసిస్‌ఉగ్ర సంస్థపై రష్యా దాడుల నేపథ్యంలో రష్యాను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement