ఎర్రజెండా ఎగిరిన వేళ... | Sakshi
Sakshi News home page

ఎర్రజెండా ఎగిరిన వేళ...

Published Fri, Feb 26 2016 11:11 AM

ఎర్రజెండా ఎగిరిన వేళ...

అప్పుడే ఓ ఉద్యమం ముగిసింది. రాచరికం అంతమైన వేళ... రక్తసిక్త ఉద్యమం ముగిసిన వేళ... ఇంక అంతా మంచేనని ప్రజలు పండగ చేసుకుంటున్న వేళ.. సామ్యవాద, పెట్టుబడిదారీ విధానాల మధ్య యుద్ధం మొదలైంది. దేశంపై ఆధిపత్యం కోసం జరిగిన ఆ పోరాటంలో ఎంతో మంది సామాన్యులు బలయ్యారు. సుమారు 90 లక్షల మంది రక్తాన్ని పూసుకుని ఎర్రజెండా ఎగిరింది. ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన రష్యా అంతర్యుద్ధం కథేంటో చూద్దాం..!
 
1917.. రష్యాలో రాచరికం అంతమైన సంవత్సరం. అంతర్యుద్ధం ప్రారంభమైన సంవత్సరం కూడా అదే. ఆ ఏడాది ఫిబ్రవరిలో రష్యా చక్రవర్తి జార్ నికోలస్-2 నిరంకుశత్వంతో విసుగు చెందిన సామ్యవాద శక్తులు రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపాయి. అక్టోబరు నాటికి నికోలస్‌ను పదవీచ్యుతుణ్ని చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాయి. అప్పటికి రష్యాలో ఎంత నిరంకుశత్వం నెలకొందంటే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్‌ని కాదని జూలియన్ క్యాలెండర్‌ని ఉపయోగించేవారు!
ఇదీ నేపథ్యం...
కార్ల్ మార్క్స్ భావజాలంతో ఉత్తేజితుడైన లెనిన్ రష్యాలో సామ్యవాదం నెలకొల్పాలనుకున్నాడు. అతను బోల్షెవిక్ పార్టీ నాయకుడు. అయితే రష్యాలోని కొంత మంది దేశంలో పెట్టుబడిదారీ విధానం ఉండాలనుకున్నారు. వీరి మధ్య ఘర్షణ మొదలైంది. కొన్ని రోజుల్లోనే ముగిసిపోతుందనుకున్న ఈ యుద్ధం ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌ల జోక్యంతో మరింత హింసాత్మకంగా మారింది.
 
బోల్షెవిక్‌ల ఆధిపత్యం...
ఈ యుద్ధంలో అగ్రదేశాలు తమకు ఎదురుగా నిలబడినప్పటికీ బోల్షెవిక్‌లు కొంచెం కూడా బెదరలేదు. వీరు మొదట పెట్రోగాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుంచి వారి విజయ ప్రస్థానం ఆగకుండా కొనసాగుతునే ఉంది. వీరికి సైబీరియాలో మాత్రం కొంచెం ప్రతిఘటన ఎదురైంది. ఇక్కడ మొదట నుంచి బోల్షెవిక్‌లు వెనుకబడి ఉన్నారు. అయితే 1919 మార్చిలో వీరు సైబీరియాపై నలువైపులా దాడులు ప్రారంభించారు. జూన్ నుంచి సైబీరియాలో వీరు పైచేయి సాధించడం ప్రారంభించారు. ఆ తర్వాత 1920 ఫిబ్రవరికి సైబీరియా వీరి సొంతమైంది. మధ్య ఆసియాలో బోల్షెవిక్‌లు పూర్తి స్థాయిలో పట్టు సాధించాక ఐరోపాలో ఉన్న రష్యాలోని బోల్షెవిక్ సేనలపై ఇంగ్లండ్ సేనలు దాడులు చేయడం ప్రారంభించాయి. ఒకానొక సందర్భంలో ఈ దాడుల వల్ల మాస్కో, తాష్కెంట్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీనివల్ల యుద్ధంలో వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఉత్తర ఆసియాలో విజయంతో వారు ఈ సమాచార లోపాన్ని అధిగమించి తిరిగి పైచేయి సాధించారు. దక్షిణ రష్యాలో రెండేళ్ల పాటు హోరాహోరీగా సాగిన పోరు అనంతరం బోల్షెవిక్‌లు అక్కడ కూడా విజయం సాధించారు. అక్టోబరు 22, 1922న తూర్పు రష్యా నుంచి జపాన్ సేనలు వెనుదిరగడంతో ఈ యుద్ధంలో బోల్షెవిక్‌లు గెలిచి సామ్యవాద రాజ్యాన్ని స్థాపించారు. ఈ పోరాటంలో మొత్తం 90 లక్షల మంది చనిపోయారు. యుద్ధానంతరం ఆర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియా, ఫిన్‌లాండ్, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, ఉక్రెయిన్ దేశాలు వాటి అంతర్యుద్ధాలు, పోరాటాల కారణంగా స్వాతంత్య్రం సాధించుకున్నాయి. ఈ యూనియన్‌కు ‘లెనిన్’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మిగిలిన దేశాలతో కలిసి రష్యా ‘సోవియెట్ యూనియన్’గా ఏర్పడింది. ఆ తర్వాత 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది.
 
 లెని‘నిజం’.....
 లెనిన్ పూర్తిపేరు వ్లాదిమిర్ ఇలిచ్ ఉల్యనోవ్. ఈయన 1870, ఏప్రిల్ 22న రష్యాలోని వోల్గా నది తీరాన ఉన్న సింబిర్క్స్ పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి ఇల్యా నికోలవిచ్ ఉల్యనోవ్, తల్లి మారియా అలెగ్జాండ్రోవ్నా. ఆయనది మిశ్రమ జాతి కుటుంబం. ఈయన పూర్వీకులు రష్యన్, స్వీడిష్, కాల్మిక్, జర్మన్, యూదు జాతులవారు. ఈయన తండ్రి స్కూల్ టీచర్. జార్ అలెగ్జాండర్-3పై హత్యాయత్నం చేశాడనే ఆరోపణలతో లెనిన్ అన్నను ఉరి తీశారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి తన భావజాలాన్ని కలిపి లెనిన్ చేసిన రచనలకు, భావాలకు ‘లెనినిజం’ అంటారు. ఆయన బోల్షెవిక్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. రష్యా అంతర్యుద్ధంలో బోల్షెవిక్‌ల విజయంలో లెనిన్, స్టాలిన్‌లదే కీలక పాత్ర. ఈ యుద్ధం కొనసాగుతుండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతర్యుద్ధం అనంతరం ఏర్పడిన యూఎస్‌ఎస్‌ఆర్‌కు ఈయనే తొలి అధ్యక్షుడు. 1924, జనవరి 21న పదవిలో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. మన దేశానికి చెందిన ఎం.ఎన్. రారూ, వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ్ వంటి కమ్యూనిస్టులతో ఈయనకు నేరుగా సంబంధాలున్నాయి.

 
 

Advertisement
Advertisement