మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..?  | Sakshi
Sakshi News home page

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..? 

Published Sun, Feb 4 2018 1:04 AM

A strange fraud came out at the Gini country in African continent - Sakshi

మంత్రాలు.. తంత్రాలు.. మాయలు.. మోసాలు.. మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో చాలా మంది వీటిని నమ్ముతారు. ఇలాగే ఆఫ్రికా ఖండంలోని గినీ దేశంలో కూడా ఓ వింత మోసం బయటపడింది. ఫాంటా కమరా అనే ఆవిడ అక్కడ చాలా ఫేమస్‌. పిల్లలు కలగని దంపతులు ఆమె దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. ఇందుకోసం కొంత మొత్తాన్ని కూడా ఆమెకు ముట్టజెపుతారట. అయితే ఆమె దగ్గరికి వచ్చిన మహిళా భక్తులకు ప్రసాదమంటూ చెట్ల పసరుతో తయారు చేసిన ద్రవాన్ని ఇస్తుందట. దీంతో మహిళలకు గర్భం వచ్చినట్లు భావిస్తారట.

ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మందిని ఇలా మోసం చేసిందట. పైగా ఈ ద్రవం తీసుకున్నాక ఏ వైద్యుడు ఇచ్చిన మందులు తీసుకోవద్దని హెచ్చరించేదట. దీంతో భండారం బయటపడకుండా ఇన్ని రోజులు ఆమె మోసం చేస్తూనే ఉందట. అయితే ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఈ భండారాన్ని బయటపెట్టిందట. బాధితుల్లో కొందరు గర్భం కోసం 12 నుంచి 16 నెలల పాటు ఎదురుచూశారని వాపోయారు. అంతేకాదు ఆమెను ఒక్కసారి దర్శించుకోవాలంటే దాదాపు రూ.2,200 చెల్లించాలట. ఇంతకీ అక్కడ సగటు నెల జీతం ఎంతో తెలుసా.. కేవలం రూ.3,100.   

Advertisement
Advertisement