గాలి వానలో.. వాన నీటిలో.. బంతి ప్రయాణం | Sakshi
Sakshi News home page

గాలి వానలో.. వాన నీటిలో.. బంతి ప్రయాణం

Published Sun, Sep 3 2017 2:05 AM

గాలి వానలో.. వాన నీటిలో.. బంతి ప్రయాణం - Sakshi

ఫొటోలో బంతుల్లా కనిపిస్తున్న వాటి పేరు సర్వైవర్‌ క్యాప్సూల్స్‌. వరదలు, సునామీలు గట్రా వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు పనికొచ్చే గూళ్లు అన్నమాట. అమెరికాలో ‘సర్వైవర్‌ క్యాప్సూల్‌ ఎల్‌ఎల్‌సీ’ పేరుతో ఏర్పాటైన కంపెనీ తయారు చేస్తోంది వీటిని. విపత్కర పరిస్థితుల్లో క్యాప్సూల్స్‌లోకి దూరిపోయి తలుపేసుకుంటే చాలు.. ఎంతటి ఇబ్బందినైనా తట్టుకుని కొన్ని రోజుల పాటు నిక్షేపంగా ఉండవచ్చునని కంపెనీ చెబుతోంది. వైమానిక ఇంజనీర్లు కొందరు దీన్ని డిజైన్‌ చేశారని, విమానాల తయారీకి వాడే దృఢమైన అల్యూమినియంతో తయారైన ఈ క్యాప్సూల్‌ పది అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డా లోపలున్న వారికి ఏమాత్రం ఇబ్బందికలగదని గ్యారెంటీ ఇస్తోంది కంపెనీ.

ఫొటోలో కనిపిస్తున్న క్యాప్సూల్స్‌లో ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చుగానీ... ఈ కంపెనీ నలుగురు, ఆరుగురు, ఎనిమిది, పది మంది కూర్చోగల మోడళ్లను సిద్ధంగా ఉంచింది. ఇద్దరు మాత్రమే కూర్చోగల క్యాప్సూల్స్‌లో దాదాపు ఐదురోజులకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు బంతిలాంటి ఈ క్యాప్సూల్స్‌ ఎన్ని ఆటుపోట్లకు గురైనా మునిగిపోకుండా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోపల ఉన్నవారు పీల్చుకునేందుకు గాలిని, వదిలిన గాలిని బయటకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు, లైటింగ్, క్యాప్సూల్స్‌ ఎక్కడున్నాయో గుర్తించేందుకు జీపీఎస్‌ వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా మ్యూజిక్‌ సిస్టమ్, టాయిలెట్‌ వంటి అదనపు హంగులను అడిగి చేయించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ క్యాప్సూళ్లను అమెరికాలోని లాంగ్‌బీచ్‌లో, జపాన్‌లోనూ ప్రవేశపెట్టాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇంతకీ దీని ధరెంతో తెలుసా? ఇద్దరు పట్టే క్యాప్సూల్స్‌కు దాదాపు 13,500 డాలర్లు. అంటే కొంచెం అటుఇటుగా పది లక్షల రూపాయలన్నమాట!
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement