భర్తమీద ప్రేమతో అతడి గుండెను.. | Sakshi
Sakshi News home page

భర్తమీద ప్రేమతో అతడి గుండెను..

Published Tue, Oct 1 2019 12:29 PM

Sweetheart Abbey Scotland - Sakshi

ప్రేమ పిచ్చిది అనటానికి ఆమె ఓ నిదర్శనం. భర్తను ఎంతగా ప్రేమించిందో అతడు చనిపోతే అంతగా రోధించింది. అతన్ని విడిచి దూరంగా ఉండలేకపోయింది. తనకు మాత్రమే సొంతమైన భర్త హృదయాన్ని మట్టిలో కలిసిపోనివ్వకుండా.. ఏ మహిళా చేయని సాహసానికి ఒడిగట్టింది. భర్త శరీరంనుంచి గుండెను వేరుచేసి చనిపోయే వరకు తనతోపాటే అంటిపెట్టుకుంది. భర్తమీద తను చూపిన ప్రేమకు గుర్తుగా ఆమెను సమాధి చేసిన ప్రదేశం పవిత్ర ప్రేమ స్థలంగా మారింది. అదే  స్కాట్‌లాండ్‌ న్యూ అబేలోని‘‘ స్వీట్‌హార్ట్‌ ఆఫ్‌ అబే’’

డేవర్‌గిల్లా, జాన్‌ బాల్లియాల్‌
భర్త మీద ఎనలేని ప్రేమతో..

పూర్వం స్కాట్‌లాండ్‌కు సమీపంలోని గాల్లోవేను జాన్‌ బాల్లియాల్‌ అనే రాజు పరిపాలించేవాడు. అతడి భార్య డేవర్‌గిల్లాకు జాన్‌ అంటే ఎనలేని ప్రేమ. భర్తలేకుండా ఒక్కక్షణం కూడా ఉండేది కాదు. 1268 సంవత్సరంలో జాన్‌ మరణించాడు. అతడి మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది! భర్తను విడిచి ఉండలేకపోయింది. తనకు ప్రేమను పంచిన జాన్‌ హృదయాన్ని తనతోనే ఉంచుకోవాలనుకుంది. భర్త శరీరం నుంచి గుండెను వేరుచేసి కొన్ని రసాయనాల సహాయంతో పాడు కాకుండా నిల్వ ఉండేలా చూసుకుంది.

దాన్ని వెండి పెట్టెలో భద్రపరిచి ఎల్లవేళలా తనవెంట ఉంచుకునేది. డేవర్‌గిల్లా భర్త మీద ప్రేమతో ఎన్నో సేవాకార్యక్రమాలను చేపట్టింది. ఆ సమయంలోనే క్రిష్టియన్‌ అబే ఆఫ్‌ డుల్సీ కోర్‌(అంటే ‘‘స్వీట్‌హార్ట్‌’’ అనే లాటిన్‌ అర్థం వస్తుంది) చర్చిని నిర్మించింది. ఆమె భర్త హృదయాన్ని చనిపోయే ఆఖరి క్షణం వరకు తనతోనే ఉంచుకుంది. 1289 సంవత్సరంలో ఆమె చనిపోయింది. డేవర్‌గిల్లా చనిపోయినా భర్త జ్ఞాపకాన్ని ఆమెనుంచి వేరుచేయలేదు. ఆమె శరీరంలోని కుడివైపు వక్షంలో జాన్‌ గుండెను ఉంచి స్వీట్‌హార్ట్‌ అబే ముందు సమాధి చేశారు.

ఓ ప్రవిత్రమైన స్థలంగా..
డేవర్‌గిల్లాను భర్త గుండెతో పాటు సమాధి చేసిననాటి నుంచి  ‘స్వీట్‌హార్ట్‌ ఆఫ్‌ అబే’ ఓ పవిత్ర ప్రేమ స్థలంగా మారింది. స్కాట్‌లాండ్‌ నలుమూలల నుంచి ఆ ప్రదేశాన్ని సందర్శించటానికి పర్యటకులు  వస్తుంటారు. సంవత్సరం పొడువునా ఈ స్థలం పర్యటకులతో కోలాహలంగా ఉంటుంది.

Advertisement
Advertisement