ప్రేమకు చిహ్నం.. ఈ 'పాదరక్ష'మందిరం | Sakshi
Sakshi News home page

ప్రేమకు చిహ్నం.. ఈ 'పాదరక్ష'మందిరం

Published Sat, Jan 16 2016 10:04 AM

ప్రేమకు చిహ్నం.. ఈ 'పాదరక్ష'మందిరం

ఒకటీ అరా కాదు మొత్తం 320 దళసరి గాజు పలకలతో 55 అడుగుల ఎత్తు, 36 అడుగుల వైశాల్యంతో మహిళలు ధరించే ఎత్తుమడమల బూట్ల(హైహీల్స్ షూ) ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం నిజానికి ఒక ప్రార్థనా మందిరం. నైరుతి తైవాన్ లోని సముద్రతీరంలో నిర్మితమైన ఈ షూ చర్చిని కట్టడం వెనకున్న ఉద్దేశం కూడా ఆసక్తికరమే. అంతకంటే ముందు స్థానికంగా ప్రచారంలోఉన్న ఓ అవివాహిత గాథను మనం తప్పక తెలుసుకోవాలి.

అనగనగా నైరుతి తైవాన్ లో ఓ అందమైన యువతి ఉండేది. ఆమెను వరించి తమదాన్ని చేసుకునేందుకు చుట్టుపక్కల దేశాల యువకులు పోటీపడేవారు. ఓ శుభదినాన ఒక వీరుడితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. మరికొన్ని రోజుల్లో పెళ్లవుతుందనగా బ్లాక్ ఫూట్ డిసీజ్(భయంకరమైన కాళ్ల జబ్బు) బారినపడిందామె. ఆదిలోనే తుంచకుంటే మాయదారి రోగం ఒళ్లంతా వ్యాపిస్తుందని.. ఆమె రెండు కాళ్లూ తీసేశారు వైద్యులు. దీంతో నిశ్చయమైన పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ తర్వాత ఆమెను మనువాడేందుకు ఒక్కరూ ముందుకురాలేదు. కాలక్రమంలో ఆమె దైవభక్తురాలిగా మారింది. శేషజీవితం మొత్తాన్ని ఓ చర్చిలో గడిపింది. అక్కడే తుది శ్వాస విడిచింది. ఆమె గుర్తుగానే ఈ చర్చిని నిర్మించారని ప్రచారంలోఉంది. 'ఈ కారణం గానే  షూ చర్చీని నిర్మిస్తున్నాం' అని అధికారికంగా చెప్పనప్పటికీ స్థానిక ప్రభుత్వమే ఈ భారీ నిర్మాణానికి పూనుకుంది.

ప్రేమికులకు భాగ్యం
దివంగత అందగత్తెకు గుర్తుగా నిర్మించిన ఈ షూ చర్చిలో సాధారణ ప్రార్థనలుండవు. కేవలం వివాహ వేడుకలు మాత్రమే జరుగుతాయి. అది కూడా ప్రేమ వివాహాలు మాత్రమే! 'మహిళా పర్యాటకులను ఆకర్షించడంతోపాటు వెరైటీ వెడ్డింగ్ కోరుకునేవాళ్లకు గమ్యస్థానంగా ఉండాలనే దీనిని నిర్మించాం' అని తైవాన్ పర్యాటక శాఖ అధికార ప్రతినిధి జెంగ్ రోంగ్ ఫెంగ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చే ప్రేమికులు కాసేపు సేదతీరేలా, ప్రత్యేకమైన సీటింగ్ ఏర్పాటు చేశారీ చర్చిలో. అన్నట్టూ ఈ నిర్మాణాన్ని సందర్శించే ప్రతిఒక్కరికీ ఉచితంగా బిస్కెట్లూ, కేకులూ అందిస్తారట.

Advertisement
Advertisement