Sakshi News home page

ఈ బెడ్పై ఉంటే భూకంపం వచ్చినా బేఫికర్

Published Mon, Dec 21 2015 10:25 AM

ఈ బెడ్పై ఉంటే భూకంపం వచ్చినా బేఫికర్

బీజింగ్: మనిషితో ప్రకృతి.. ప్రకృతితో మనిషి నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటారు. ప్రతిసృష్టి చేసిన ప్రతిసారి మరో రూపంలో ప్రకృతి ప్రకోపిస్తూనే ఉంటుంది. దాన్ని అధిగమించేందుకు మనిషి కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. సాధారణంగా భూకంపం అనగానే అదొక విధ్వంసం. బాంబులకంటే శక్తిమంతమైన దారుణం. కూకటివేళ్లతో పెకలించుకు బయటకు వచ్చే చెట్లు, పునాదితో సహా నేలమట్టమయ్యే భవనాలు భూకంపంవచ్చినప్పుడు మన కళ్లకు కనిపించే ప్రత్యక్ష దృశ్యాలు.. వీటి మధ్య ప్రాణనష్టానికి సంబంధించిన హాహాకారాలు కూడా.

ఇలాంటి భూకంపం నుంచి తమను తాము కాపాడుకునే అవకాశం ఉంటే ఎందుకు వదులుకుంటారు. సాధారణంగా మెలకువలో ఉన్నప్పుడు భూకంపంవస్తే ఏదో ఒకలా తమ ప్రాణాలు రక్షించుకోవచ్చు.. కానీ గుర్మంటూ నిద్రపోయే సమయంలో భూకంపం వస్తే.. దాని ధాటికి పైకప్పంతా కూలిమీదపడిపోతే.. ఊహించుకోవాడానికి గుండెలు జారిపోయేలాగా ఉంది కదా.. అందుకే, చైనాలో ఓ కొత్త తరహా పడకమంచాన్ని తయారు చేశారు. భూకంపం రాగానే అది దానంతటి అదే ముడుచుకుపోయి నేలపై పడేసిన ఓ పెద్ద బీరువా మాదిరిగా మారిపోతుంది.

అంతకుముందు దానిపై నిద్రించిన వ్యక్తి తన ప్రయత్నం లేకుండానే దాని లోపలికి వెళ్లిపోతాడు. పై కప్పు మీదపడినా అతడికి ఎలాంటి గాయాలు కావు. పైగా, అతడికి కావాల్సిన ఆక్సిజన్, ఆహారం, తాగు నీరు వంటి సౌకర్యాలు కూడా ఆ బీరువాలాంటి బెడ్ లో ఉంటాయి. అయితే, ఈ బెడ్ రూంలో నుంచి ఎలా బయటపడాలి అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ బెడ్ పనిచేసే విధానం గురించి తయారీ దారు యూట్యూబ్ లో పెట్టగా ఇప్పుడది హల్ చల్ చేస్తోంది.

 

Advertisement
Advertisement