లాక్‌డౌన్‌ వ్యూహకర్తే గర్ల్‌ఫ్రెండ్‌ కోసం.. | Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి రప్పించిన శాస్త్రవేత్త రాజీనామా

Published Wed, May 6 2020 8:44 PM

Top Scientist Flouts Lockdown Protocol - Sakshi

లండన్‌ : కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించిన బ్రిటన్‌ ప్రభుత్వ శాస్త్రవేత్త స్వయంగా తానే లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి గర్ల్‌ఫ్రెండ్‌ను తన ఇంటికి అనుమతించిన ఘటన వివాదం రేపింది. లాక్‌డౌన్‌ సమయంలో తనతో సన్నిహిత సంబంధం కలిగిన మహిళను తన ఇంటికి పిలిపించుకున్న బ్రిటన్‌ శాస్త్రవేత్త తన పదవికి రాజీనామా చేశారు. అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్‌ నీల్‌ ఫెర్గ్యూసన్‌ సూచనతోనే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నారు. తాజాగా ఫెర్గ్యూసన్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ కోసం చేసిన నిర్వాకం పెనుదుమారం రేపడంతో అత్యున్నత సైంటిఫిక్‌ గ్రూప్‌ ఫర్‌ ఎమర్జెన్సీస్‌ (సేజ్‌) నుంచి ఆయన తప్పుకున్నారని ది డైలీ టెలిగ్రాఫ్‌ వెల్లడించింది.

లండన్‌లో తన ఇంటికి ఆంటోనియా స్టాట్స్‌ అనే మహిళను రెండు సార్లు అనుమతించానని ఫెర్గ్యూసన్‌ అంగీకరించారు. ఇళ్లలోనే ఉండి ప్రాణాలు కాపాడుకోండని స్వయంగా ఆయన ఇచ్చిన నినాదాన్నే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కఠినంగా అమలుచేస్తుండగా చోటుచేసుకున్న ఈ ఘటన ఫెర్గ్యూసన్‌ను ఇరకాటంలోకి నెట్టింది. కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత ఆయన రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన అనంతరం ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాను పొరపాటు చేసినట్టు అంగీకరిస్తూ సేజ్‌ నుంచి వైదొలుగుతున్నానని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించడమే కరోనా మహమ్మారికి విరుగుడని శాస్త్రవేత్త ఫెర్గ్యూసన్‌ చెప్పుకొచ్చారు. క్రమశిక్షణ కలిగిన శాస్త్రవేత్త ఫెర్గ్యూసన్‌ ఇలా చేయడం నమ్మలేకపోతున్నామని, ఇది కఠిన లాక్‌డౌన్‌ నిబంధనల స్ఫూర్తికి విఘాతమని కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి ఇయాన్‌ స్మిత్‌ విస్మయం వ్యక్తం చేశారు. ఫెర్గ్యూసన్‌ చర్యను పలువురు తప్పుపడుతున్నారు.

చదవండి : కోవిడ్‌ కేంద్రంగా బ్రిటన్‌

Advertisement
Advertisement