ఉత్తరకొరియా దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి | Sakshi
Sakshi News home page

ఉత్తరకొరియా దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి

Published Thu, Apr 13 2017 8:39 AM

ఉత్తరకొరియా దెబ్బకు ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి - Sakshi

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా దెబ్బకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?. తాజా పరిణామాలు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. ఉత్తర కొరియాను అదుపు చేయడానికి చైనా సహకరిస్తే బావుంటుందని ట్రంప్‌ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీట్‌ ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్‌ ట్వీట్‌ను చైనా చూసి చూడనట్లు ఊరుకుంది. ఉత్తర కొరియా సముద్ర జలాల చేరువలోకి అమెరికా యుద్ధ నౌకలు వెళ్లడంతో ఆ దేశం అమెరికాపై అణుదాడికి తాము వెనుకాడమని ప్రకటించింది.

ఉత్తరకొరియా ప్రకటనతో ఒక్కసారిగా ప్రపంచదేశాలు షాక్‌కు గురయ్యాయి. అగ్రరాజ్యంపై ఉత్తరకొరియా వ్యాఖ్యల ధైర్యాన్ని చూసి కొన్ని దేశాలు లోలోపలే నవ్వుకున్నాయి కూడా. ఉత్తరకొరియా కలవరం ట్రంప్‌ను నిద్రపోనిస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే చైనా ద్వారా ఆ దేశానికి చెక్‌ పెట్టాలని ట్రంప్‌ యోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చైనాతో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో తన కెమిస్ట్రీ బాగుందంటూ ట్రంప్‌ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

మంగళవారం జిన్‌ పింగ్‌కు ట్రంప్‌ ఫోన్‌ చేశారు. వ్యాపార సంబంధాల విషయం గురించే కాక మరెన్నో అంశాలు చర్చించుకున్నామని మీడియాతో చెప్పుకొచ్చారు ట్రంప్‌. చైనాతో మంచి వ్యాపారసంబంధాలు పెంచుకోవడం వల్ల ఉత్తరకొరియాను అదుపు చేయడం సులువు అవుతుందని తాను అనుకుంటున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement