బంధించిన బాలికను రక్షించిన సింహాలు | Sakshi
Sakshi News home page

బంధించిన బాలికను రక్షించిన సింహాలు

Published Thu, Dec 31 2015 8:47 AM

బంధించిన బాలికను రక్షించిన సింహాలు - Sakshi

సింహం.. క్రూరత్వానికి.. కర్కశత్వానికి మారుపేరు..! అడవికి రారాజు.. జంతువులకు మృగరాజు. ఆధిపత్యం కోసం ప్రత్యర్థులను దారుణంగా చంపుతుంది. మాట వినకుంటే.. తమ సంతానంపై కూడా కరుణ చూపదు. నిర్దాక్షిణ్యంగా పంజా విసురుతుంది. అది దాని నైజం! అంతటి క్రూర జంతువులైన సింహాలు.. మృగాల్లాంటి మనుషుల నుంచి ఓ బాలికను కాపాడాయంటే నమ్ముతారా? సినీఫక్కీలో జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు మీరే చదవండి.

2005లో ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో జరిగింది ఈ ఘటన. దక్షిణ ఇథియోపియాలోని సెఫలోనియా ప్రాంతంలో ఓ గిరిజన గ్రామంలో ‘పోలీ’ అనే బాలిక తల్లిదండ్రులతో నివసించేది. ఆడుతూ.. పాడుతూ అందరితో కలివిడిగా ఉండే పోలీ అంటే గ్రామంలో తెలియనివారుండరు. పశ్చిమ దేశాల కంపెనీలు ఇథియోపియా పాలిట శాపంగా తయారయ్యాయి. వాటి మైనింగ్ దెబ్బకు అక్కడి అరణ్యాలు, గుట్టలు కనుమరుగయ్యాయి. పోలీ స్వగ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా తాగునీటి కొరత. మైళ్ల దూరం కాలినకడన వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి. దీంతో గ్రామస్తులు సింహాల దాడిలో చనిపోతున్నారు.

అది జూన్2, 2005. మంచినీళ్ల కోసం ఇంట్లో ఉన్న క్యాను తీసుకుని బయల్దేరింది పోలీ. అడవి పక్కన ఓ చెలిమెలో నీళ్లు పట్టుకుని ఇంటికి వస్తుండగా లస్సీ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పోలీని ఎత్తుకెళ్లాడు. ఇథియోపియాలో ఓ దుష్ట సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. తమ తెగలో నచ్చిన పిల్లను ఎత్తుకెళ్లి పెళ్లాడవచ్చు. అందుకనే లస్సీ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అడవికి సమీపంలో ఉన్న తన పొలంలోని గుడిసెలో పోలీని బంధించాడు లస్సీ. పెళ్లి చేసుకోమని బెదిరించాడు, కొట్టాడు. బెదిరిపోయిన ఆ బాలిక ఏడ్వడం మొదలు పెట్టింది. మరోవైపు చీకటిపడినా పోలీ ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

మరోవైపు స్పృహ కోల్పోయి గుడిసెలో పడి ఉన్న పోలీ.. ఏదో శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి లేచింది. కిటికీ నుంచి ఏవో వెలుగులు ఆకుపచ్చ దీపాల్లా కనిపిస్తున్నాయి. ఏవో కాంతిపురుగులు అయి ఉంటాయనుకుంది. అలా ప్రతిరోజూ రాత్రి ఆ ఆకుపచ్చ వెలుగులు కనిపిస్తున్నాయి. అమ్మనాన్నలను తలుచుకుని పోలీ ఏడవని క్షణం లేదు. మరోవైపు పెళ్లికి ఒప్పుకోవాలంటూ లస్సీ బాలికను రోజూ కొడుతున్నాడు. అలా వారం గడిచింది. అది జూన్ 9. పోలీ జాడ కోసం పోలీసులు, అటవీ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. సాయంత్రం స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ‘లస్సీ’ భయపడ్డాడు. అదే రోజు రాత్రి పోలీని చంపేద్దామనుకున్నాడు. గుడిసెలో నుంచి పోలీని బయటికి ఈడ్చుకువచ్చాడు. పోలీ నిస్సహాయంగా కేకలు వేస్తోంది. ఇంతలో గుడిసె పక్కనున్న పొదలో ఏదో అలికిడి అయింది. అంతా నిశ్శబ్దం! పొదలను దాటుకుని మూడు భారీ ఆకారాలు బయటికి వచ్చాయి. ఆరు ఆకుపచ్చ లైట్లు మునుముందుకు వస్తున్నాయి. అవి సింహాలు..! అంటే వారంరోజులుగా కిటికీ వద్ద తాను చూసింది సింహాల కళ్లా? దేవుడా.. వీళ్లు చంపుతారనుకుంటే ఇప్పుడు సింహాల చేతిలో చావాలా? అనుకుంటూ కళ్లు మూసుకుంది పోలీ.

సింహాలను చూసిన లస్సీ, అతని మిత్రులకు పైప్రాణాలు పైనే పోయాయి. పోలీ మూర్చపోయింది. లస్సీతోపాటు ఆరుగురు మిత్రబృందంపై సింహాలు పంజాలతో విరుచుకుపడ్డాయి. ఆ దెబ్బలకు వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు మాత్రం అరుస్తూ గ్రామంవైపు పరుగులు తీశారు. పోలీ కోసం వెదుకుతున్న పోలీసులకు వీరు ఎదురుపడ్డారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గుడిసె వద్దకు పరుగున వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. పోలీ చుట్టూ మూడు సింహాలు కాపలాగా కూర్చున్నాయి. పోలీసులు రాగానే.. లేచి నెమ్మదిగా పొదల్లోకి వెళ్లిపోయాయి. అప్పుడు బాలిక వైపు అడుగేశాడు గాలింపు బృందానికి నేతృత్వం వహిస్తున్న సార్జెంట్ వాంటమ్. విచిత్రమేంటంటే.. సింహాల దాడిలో గాయపడ్డ నిందితులెవరూ మరణించలేదు.

బాలికను సింహాలు రక్షించాయన్న వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. పోలీ గురించి జనం కథలు కథలుగా చెప్పుకోసాగారు. కొందరు ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం మొదలు పెట్టారు. బీబీసీ కూడా ఈఘటనపై ప్రత్యేక కార్యక్రమం చేయడంతో పోలీని చూసేందుకు జనం, మీడియా వివిధ దేశాల నుంచి ఆమె ఇంటి ముందు వాలిపోయేవారు. ఈ గోల భరించలేక పోలీ కుటుంబం మరో ఊరికి వలస వెళ్లి రహస్యజీవనం గడపసాగింది.

ఈ సంఘటన ప్రముఖ జంతుశాస్త్రవేత్త డాక్టర్ సిన్పూర్ దృష్టిని ఆకర్షించింది. ఇందులో నిజమెంతో తేల్చుకోవాలని 2008లో ఆమె ఇథియోపియాకు వచ్చింది. నానా కష్టాలు పడి పోలీని, సార్జెంట్ వాంటమ్‌ను కలుసుకుంది. వారితో మరోసారి అడవికి వెళ్లింది. ఆకాశం నుంచి ఊడిపడ్డట్లుగా ఆ సింహాల మంద వారి ముందు ప్రత్యక్షమైంది. ఊహించని పరిణామంతో డాక్టర్ సిన్పూర్, సార్జంట్ భయపడిపోయారు. పోలీ కూడా మరోసారి వీరితో వచ్చి తప్పు చేశాననుకుంది. సింహాలు దగ్గరకు రాసాగాయి. కదలకుండా నిల్చున్నారు ముగ్గురూ. వారి వద్దకు వచ్చిన సింహం పోలీని ప్రేమగా నాలికతో తడిమి మళ్లీ అడవిలోకి వెళ్లింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement