ఎక్కాడు... చిక్కుకున్నాడు | Sakshi
Sakshi News home page

ఎక్కాడు... చిక్కుకున్నాడు

Published Sun, Apr 10 2016 7:01 AM

ఎక్కాడు... చిక్కుకున్నాడు

‘గుట్టలెక్కగలవా... ఓ నరహరి, పుట్టలెక్కగలవా...’ అని పాపం ఆ అమ్మడు అడగలేదు, అయినా సరే గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేద్దామని కాలిఫోర్నియాకు చెందిన మైకేల్ బ్యాంక్స్ అనే 27 ఏళ్ల కుర్రాడు కొత్త ఆలోచన చేశాడు. కాలిఫోర్నియా మధ్యతీరంలో ఉన్న 600 అడుగుల ఎత్తై‘మొరో రాక్’ (ఏకశిల)ను అధిరోహించి హీరోచితంగా గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసే ప్రయత్నం చేశాడు. అమ్మడు లైవ్ వీడియో స్ట్రీమింగ్ ద్వారా చూస్తుండగా వీరావేశంతో గబగబా ఎక్కేశాడు. అయితే నిటారుగా ఉండే ఈ శిలను ఎక్కడాన్ని నిషేధించారు. మైకేల్ బ్యాంక్స్ పైకి ఎక్కనయితే ఎక్కాడుగాని... కిందకు దిగేటప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాడు.

కిందకు చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. ఎటువైపు వెళ్లాలో... ఎటు దిగాలో తెలియడం లేదు. దాంతో చిత్రంలో కనిపిస్తున్నట్లుగా శిలపైనే వెల్లకిలా పడుకుండిపోయాడు. రక్షించమని ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేశాడు. వారొచ్చి చూసి... వెంటనే హెలికాప్టర్‌ను పిలిపించారు. హెలికాప్టర్ నుంచి ఓ అధికారి కిందకు వేలాడుతూ ఇదిగో ఇలా మైకేల్‌ను సురక్షితంగా కిందకు దించారు. నిషేధిత ప్రాంతం కాబట్టి అతన్ని రక్షించడానికైన ఖర్చు... అతనే పెట్టుకోవాలని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తేల్చిచెప్పారు. ఖర్చయితే అయిందిగాని మైకేల్‌కు శుభవార్త ఏమిటంటే... అతని పెళ్లి ప్రతిపాదనకు గర్ల్‌ఫ్రెండ్ ఓకే చెప్పేసిందట.

Advertisement
Advertisement