ఇవాంకకు వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఆఫీసు | Sakshi
Sakshi News home page

ఇవాంకకు వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఆఫీసు

Published Tue, Mar 21 2017 3:20 PM

ఇవాంకకు వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఆఫీసు - Sakshi

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ ఎట్టకేలకు తన తండ్రికి మరింత దగ్గరవనున్నారు. ఆయనతోపాటు శ్వేతసౌదంలో ఉండబోతున్నారు. ఆమెకు వైట్‌ హౌస్‌లోని పశ్చిమ దిశగా ఉన్న వింగ్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. అందులోకి ఇవాంక తన భర్త జారెడ్‌ కుష్‌నర్‌తో కలిసి ఉండబోతున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌదం అధికారికంగా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ట్రంప్‌కు నిత్యం సలహాలు ఇస్తున్న ఆమె ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక హోదానుగానీ, ఆమె చేస్తున్న పనులకు జీతభత్యాలుగానీ కోరుకోవడం లేదని వైట్‌ హౌస్‌ పేర్కొంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు చీఫ్‌ సలహాదారుడిగా ఇవాంక భర్త జారెడ్‌ ఉన్నారు. ముందునుంచి తండ్రి పరిపాలనలో తన జోక్యం ఉండబోదని చెప్పిన ఇవాంక ప్రతిసారి పరోక్షంగా ట్రంప్‌తో కనిపిస్తున్నారు. గత వారం ట్రంప్‌తో జర్మనీ చాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌ సమావేశం అయినప్పుడు ఆమె పక్కనే ఇవాంక కూర్చున్నారు. 

Advertisement
Advertisement