లెగ్గింగ్స్ వేసుకున్నారని.. | Sakshi
Sakshi News home page

లెగ్గింగ్స్ వేసుకున్నారని..

Published Mon, Mar 27 2017 7:55 AM

లెగ్గింగ్స్ వేసుకున్నారని.. - Sakshi

ఇద్దరు అమ్మాయిలు లెగ్గింగ్స్ వేసుకున్నారని అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ వారిని విమానం ఎక్కనివ్వలేదు. లెగ్గింగ్స్ వేసుకొచ్చిన మరో అమ్మాయిని కూడా విమానంలో వెళ్లాలంటే ఆ దుస్తులు మార్చుకోవాల్సిందిగా ఆదేశించారు. డెన్వర్ నుంచి మిన్నీపొలిస్ వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగినట్లు షానన్ వాట్స్ అనే ప్రత్యక్ష సాక్షి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ విషయమై ఆమె పెద్ద యుద్ధమే మొదలుపెట్టారు. దానికి మద్దతుగా అనేకమంది నెటిజన్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీరు మీద మండిపడ్డారు. ఆ విమానయాన సంస్థ మాత్రం, ఎవరైనా సరిగా దుస్తులు వేసుకోకపోతే వాళ్లను విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకునే హక్కు తమకుందని వాదిస్తోంది. ఎవరైనా ప్రయాణికులు కాళ్లకు చెప్పులు వేసుకోకపోయినా, సరిగా దుస్తులు వేసుకోకపోయినా తాము విమానం ఎక్కనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. అయితే.. సరైన దుస్తులంటే ఏంటో మాత్రం చెప్పలేదు.

సాధారణ ప్రయాణికులనైతే లెగ్గింగ్స్ లేదా యోగా ప్యాంట్లు ధరించినా తాము అనుమతిస్తామని, కానీ పాస్ మీద ప్రయాణించేవాళ్లు మాత్రం తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి జొనాథన్ గెరిన్ అన్నారు. ఆ అమ్మాయిలు ఇద్దరూ యునైటెడ్ ఉద్యోగుల పాస్ మీద ప్రయాణిస్తున్నారని, అందుకే తగిన డ్రస్ కోడ్ పాటించాల్సిందిగా చెప్పామని వివరించారు. కానీ, యునైటెడ్ వాదనను అమెరికన్లు కొట్టిపారేస్తున్నారు. ఎవరికైనా తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉంటుందని, దాని మీద విమానయాన సంస్థలు మోరల్ పోలీసింగ్ ఎలా చేస్తాయని మండిపడుతున్నారు.

ఇది చాలా చికాకు వ్యవహారమని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లెగ్గింగ్స్ అనేవి సరైన దుస్తులు కావని ఎలా చెబుతారని.. ప్రయాణం చేసేటప్పుడు సుఖంగా ఉండేందుకు చాలామంది మహిళలు లెగ్గింగ్స్, యోగా దుస్తులు, అథ్లెటిక్ దుస్తులు ధరిస్తారని, ఇది కొత్తేమీ కాదని వాదిస్తున్నారు. తన పక్కనే కూర్చున్న అమ్మాయిని కూడా లెగ్గింగ్స్ వేసుకుని ప్రయాణించడానికి వీల్లేదని భయపెడితే.. ఆమె అప్పటికప్పుడు తన బ్యాక్‌ప్యాక్‌లోంచి వేరే డ్రస్ తీసుకుని మార్చుకుందని కూడా వాట్స్ చెప్పారు.

 

Advertisement
Advertisement