ఆ చాక్లెట్లలో ప్లాస్టిక్ ..

27 Feb, 2016 19:50 IST|Sakshi
ఆ చాక్లెట్లలో ప్లాస్టిక్ ..

అంతర్జాతీయ చాక్లెట్ కంపెనీ మార్స్ ఉత్పత్తుల్లో రెడ్ ప్లాస్టిక్ పదార్థం లభించడం కలకలం రేపుతోంది. గత నెల 8న జర్మనీలో ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన స్నిక్కర్స్ బార్‌ చాక్లెట్‌లో రెడ్ ప్లాస్టిక్ లభించడంతో.. మార్స్ పెద్ద ఎత్తున మార్కెట్‌ నుంచి తన ఉత్పత్తులను ఉపసంహరించుకుంటోంది. దాదాపు 55 దేశాల్లో తన చాక్లెట్ ఉత్పత్తులను ఈ కంపెనీ మార్కెట్ నుంచి వెనుకకు తీసుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో కంపెనీకి వందల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లనున్నట్టు భావిస్తున్నారు.

జర్మనీ వ్యక్తి తాను కొన్న స్నికర్స్‌ చాక్లెట్‌లో రెడ్ ప్లాస్టిక్‌ ఉన్నట్టు గుర్తించి వెంటనే కంపెనీకి ఫిర్యాదు చేశాడు. నెదర్లాండ్‌ వేఘేల్‌లోని ఫ్యాక్టరీలో తయారైన ఈ చాక్లెట్‌లో ప్లాస్టిక్ కలిసినట్టు కంపెనీ గుర్తించింది. తయారీ ప్రక్రియలో భాగంగా రక్షణ కోసం ఉపయోగించే కవర్‌కు చెందిన ప్లాస్టిక్ పదార్థం చాక్లెట్‌లో కలిసినట్టు గుర్తించారు. దీంతో అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున మార్స్ తన చాక్లెట్ ఉత్పత్తులను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకుంటోంది. మార్స్‌కు సంబంధించిన మిల్కీ వే, స్నిక్కర్స్, సెలబ్రేషన్స్, మినీ మిక్స్ వంటి ఉత్పత్తులపై ఈ ప్రభావం పడినట్టు కంపెనీ మంగళవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. వినియోగదారులు కొనుగోలు చేసే చాక్లెట్లలో రెడ్‌ ప్లాస్టిక్‌ పదార్ధం వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముందుజాగ్రత్త చర్యగా వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు తెలుస్తోంది.

యూఏఈలో నిషేధం
ప్రజారోగ్యం దృష్ట్యా యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్‌ (యూఏఈ)లో మార్స్‌ కంపెనీ చాక్లెట్లపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. మార్స్‌కు సంబంధించిన మిల్కీ వే, స్నిక్కర్స్, సెలబ్రేషన్స్, మినీ మిక్స్ వంటి చాక్లెట్లపై నిషేధం విధించినట్టు యూఏఈ పర్యావరణ, వాతావరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నెదర్లాండ్‌కు చెందిన మార్స్ కంపెనీ స్వచ్ఛందంగా మార్కెట్‌ నుంచి తన చాక్లెట్‌లను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు