జీతాల పెంపు.. వారానికి మూడు రోజులు సెలవు | Sakshi
Sakshi News home page

జీతాల పెంపు.. వారానికి మూడు రోజులు సెలవు

Published Mon, May 27 2019 8:40 PM

UK firm Offers Salary Hike And 4 Day Work For Employees - Sakshi

లండన్‌ : ఉద్యోగం అంటే వారానికి ఆరు రోజులు పని చేస్తే.. ఒక్క రోజు సెలవు దొరుకుతుంది. ఆ రోజు మిగతా పనులతో గడిచిపోతుంది. ఇక కుటుంబంతో తీరిగ్గా గడిపే సమయం ఎక్కడ. ఐటీ ఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థల్లో పని చేసే వారికి మాత్రమే వారానికి రెండు రోజుల సెలవు దొరుకుతోంది. మిగతా వారంతా 6 రోజులు పని చేయాల్సిందే. అయితే ఈ విషయంలో బ్రిటన్‌ ఉద్యోగులు అత్యంత అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం నెలకు ఒక్క రోజు సెలవు కోసమే కష్టపడుతుంటే.. అక్కడ ఓ కంపెనీ ఏకంగా వారానికి మూడు రోజులు సెలవు ఇస్తోంది.

ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌లో ఉన్న పోర్ట్‌కలిస్ అనే లీగల్ కంపెనీ ఈ కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. ఇక మీదట తన ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పని చేస్తే చాలంటుంది. ఇందుకు గాను జీతంలో ఎలాంటి కోతలు ఉండవని చెప్తుంది. ఈ విషయం గురించి కంపెనీ డైరెక్టర్ ట్రేవర్ వర్త్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు నాలుగు రోజుల పని దినాలు కల్పించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగుతుంది. అలసట కూడా తగ్గిపోతుంద’ని తెలిపారు. ప్రాథమిక ఫలితాలను పరిశీలిస్తే తన ఉద్యోగులు గతంతో పోల్చితే చాలా ఆనందంగా ఉంటున్నారని, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నారని వెల్లడించారు.

పనిదినాల కుదింపు ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని, ఉద్యోగుల్లో ఒత్తిడి కనిపించడం లేదని ట్రేవర్ తెలిపారు. మరో న్యూజిలాండ్ కంపెనీ ఈ పద్ధతి అనుసరించి 20 శాతం అదనపు ఉత్పాదకతను సాధించిందట. లాభాలు రావడమే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్యం కూడా బాగా ఉంటోందట. దాంతో తాము కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రేవర్‌ తెలిపారు.

Advertisement
Advertisement