మార్కుల కోసం డ్రగ్స్‌ వాడుతున్న విద్యార్థులు! | Sakshi
Sakshi News home page

మార్కుల కోసం డ్రగ్స్‌ వాడుతున్న విద్యార్థులు!

Published Wed, Jun 8 2016 4:34 PM

మార్కుల కోసం డ్రగ్స్‌ వాడుతున్న విద్యార్థులు!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో తోటి విద్యార్థులతో పోటీపడి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు జ్ఞాపకశక్తిని, సృజనాత్మకతను పెంచే ప్రమాదకరమైన మందులు వాడుతున్నారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలే కాకుండా మాంచెస్టర్, బ్రిస్టల్, వార్విక్, న్యూకాజిల్, బాత్, లీడ్స్, యూసిల్ విద్యార్థులు కూడా ప్రమాదకరమైన 'నూపెప్ట్' అనే మందును ఆశ్రయిస్తున్నారు. వారు కొకైన్‌లా పీల్చే పద్ధతిలో లేదా క్యాప్సూల్‌లా మింగుతూ ఈ మందు తీసుకుంటున్నారు.

'నేను 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు బ్రెయిన్ బూస్టర్ డ్రగ్ 'రిటాలిన్'ను తీసుకున్నాను. ఇప్పుడు నూపెప్ట్ తీసుకుంటున్నాను. ఇది తీసుకున్నాక పరీక్షలు బాగా రాశాను. మంచి ఫలితాలు వచ్చాయి. దీనికి కారణం నా సొంత శక్తా, లేక నాలో ప్రవేశించిన రసాయనం కారణమా? అన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేను గానీ, ఈ డ్రగ్ పరీక్షలు రాయడానికి ఉపయోగపడిందని మాత్రం నమ్ముతున్నాను' అని వార్విక్ యూనివర్శిటీలో సామాజిక శాస్త్రం చదువుతున్న మైక్ అనే 21 ఏళ్ల విద్యార్థి తెలిపారు. మైక్ లాగా వందలాది మంది వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ఈ డ్రగ్‌ను ఉపయోగిస్తున్నారు.

సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా 'నూపెప్ట్' ఔషధాన్ని అమ్మకూడదు. అలా చేస్తే ఏడేళ్లవరకు జైలుశిక్ష విధించే చట్టం దేశంలో అమల్లో ఉన్నా... ఈ డ్రగ్ ఆన్‌లైన్ ద్వారా విచ్చలవిడిగా విద్యార్థులకు లభిస్తోంది. అమెరికా, రష్యా మార్కెట్ల ద్వారా ఆన్‌లైన్‌లో పది గ్రాముల మందు రెండు వేల రూపాయలకు లభిస్తోంది. ఇంకా పరిశోధన దశలోనే ఉన్న రిటాలిన్, మొడాఫినిల్ కన్నా చవగ్గా దొరకుతుండడంతో ఎక్కువమంది విద్యార్థులు ఈ డ్రగ్‌నే వాడుతున్నారు. పది నుంచి 20 శాతం మంది యూనివర్శిటీ విద్యార్థులు ఈ డ్రగ్ వాడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

గతంలో వివిధ యూనివర్శిటీలు పరీక్షలకు ముందు విద్యార్థులకు డ్రగ్ పరీక్షలను నిర్వహించేవి. విద్యార్థులను అనవసరంగా శంకించడం మంచిని కాదన్న ఉద్దేశంతో ఇలాంటి పరీక్షలకు పలు యూనివర్శిటీలు స్వస్తిపలికాయి. ఆన్‌లైన్ మార్కెట్‌పై లండన్‌లో అంతగా నియంత్రణ లేకపోవడంతో ప్రమాదకరమైన ఈ డ్రగ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. నూపెప్ట్ వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండడమే కాకుండా అలవాటయ్యే లక్షణం, ఎప్పటికప్పుడు డోసేజ్ పెంచాల్సిన ప్రేరణ ఈ డ్రగ్లో ఉండటం మరింత ప్రమాదరకరం.

ఈ డ్రగ్ వల్ల మానసిక ఒత్తిడి లాంటి అనేక మానసిక రుగ్మతలు తలెత్తడమే కాకుండా, కార్డియో వాస్కులర్ లాంటి హృద్రోగాలు వస్తాయి.
అల్జీమర్స్, కొన్నిరకాల మానసిక రోగాలను నయం చేయడం కోసం 1990లో రష్యాలో ఈ ఔషధాన్ని కనిపెట్టారు. విస్తారమైన సిలబస్ కారణంగా తమపై ఒత్తిడి పెరగడం వల్లే తాము ఇలాంటి డ్రగ్స్ వాడాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.

Advertisement
Advertisement