రెబల్స్ అధీనంలో కీవ్.. ఉక్రెయిన్‌లో సంక్షోభం | Sakshi
Sakshi News home page

రెబల్స్ అధీనంలో కీవ్.. ఉక్రెయిన్‌లో సంక్షోభం

Published Sun, Feb 23 2014 3:07 AM

రెబల్స్ అధీనంలో కీవ్.. ఉక్రెయిన్‌లో సంక్షోభం

 కీవ్: ఉక్రెయిన్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వ దళాలకు, ఉద్యమకారులకు మధ్య పోరు మరింత ముదిరింది. తాజా పరిణామాలతో దేశం రెండుగా చీలిపోయింది. రాజధాని నగరం కీవ్ పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్టు ఆందోళనకారులు శనివారం ప్రకటించారు. ప్రభుత్వం, పార్లమెంట్‌లోనూ పట్టు సాధించామని, అధ్యక్ష భవనాన్ని సీజ్ చేశామని చెప్పారు. పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించి అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌ను పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించారు. అలాగే మే 25న ఎన్నికలు జరుపుతామని చెప్పారు. ఓటింగ్ నిర్వహించి జైల్లో ఉన్న తమ నేత యూలియా తిమోషెంకోను  విడుదల చేశారు.

  అయితే తాజా పరిణామాలన్నీ కుట్రపూరితంగా జరుగుతున్నాయని అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ఆరోపించారు. తాను రాజీనామా చేశానని వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంతో రాజీనామా చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను దేశాన్ని విడిచి ఎక్కడికీ వెళ్లడం లేదని, చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని తానేనని చెప్పారు. తనకూ, తన సన్నిహితులకు నిరసనకారుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
 మరోవైపు కీవ్ నడిబొడ్డులోని కీలక ప్రభుత్వ భవనాలన్నీ ఎటువంటి పోలీసు భద్రతా లేకుండా ఉన్నాయి. నిరసనకారులు సైనికుల దుస్తులు ధరించి అధ్యక్ష భవనంలో తిరుగుతున్నారు. భద్రతా కారణాలతో అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విపక్ష నేత వెలికోవిక్ చెప్పారు. మరోపక్క.. అధ్యక్షుడికి సన్నిహితుడైన పార్లమెంట్ స్పీకర్ రైబక్ రాజీనామా చేశారు. రష్యాతో సంబంధాలకోసం.. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందానికి యనుకోవిచ్ నిరాకరించడంతో గత ఏడాది న వంబర్ నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ బలగాల దమనకాండలో వందమంది నిరసనకారులు మృతిచెందారు..

Advertisement
Advertisement