కరోనా: 5 లక్షలకు పైగా ఎయిడ్స్‌ మరణాలు! | Sakshi
Sakshi News home page

5 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులు చనిపోతారు!

Published Tue, May 12 2020 6:19 PM

UN Says AIDS Deceased May Double In Sub Saharan Africa Amid Covid 19 - Sakshi

న్యూయార్క్‌: కరోనా సంక్షోభం నేపథ్యంలో హెచ్‌ఐవీ రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందకపోతే ఎయిడ్స్‌తో మరణించే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. సహారా ఆఫ్రికా ఉప ప్రాంతంలో ఈ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ‘‘కోవిడ్‌-19 వ్యాప్తి వల్ల యాంటీవైరల్‌ థెరపీకి అంతరాయం కలిగిన కారణంగా 2020-21 నాటికి సహారా ఆఫ్రికా ప్రాంతంలో 5 లక్షలకు మించి మరణాలు సంభవించే అవకాశం ఉంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), యూఎన్‌ఎయిడ్స్‌ సోమవారం  ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇక ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో హెచ్‌ఐవీ రోగులకు అందించే సేవలు, మందుల సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నాయి. (ప్రపంచంలో 82 కోట్ల మంది ఆకలి కేకలు)

ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2008 నాటి చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ ఏడాది దాదాపు 9,50,000కు పైగా ఎయిడ్స్‌ పేషెంట్లు మృత్యువాత పడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ‘‘ఎయిడ్స్‌ సంబంధిత వ్యాధులతో ఆఫ్రికాలో ఐదు లక్షలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉంది. చరిత్ర పునరావృతం అవుతుంది. మళ్లీ తిరోగమనం’’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ఆధనోమ్‌ గాబ్రియేసస్‌ హెచ్చరించారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఇప్పటికే కొన్ని దేశాలు హెచ్‌ఐవీ రోగులకు సెల్ఫ్‌ టెస్టింగ్‌ కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నాయని.. వాటిని అనుసరించాలని ఆఫ్రికా దేశాలకు విజ్ఞప్తి చేశారు.(‘సార్స్‌’లాగా ‘కరోనా’ కూడా అదృశ్యం...?)

కాగా 2018 నాటి గణాంకాల ప్రకారం సబ్‌- సహారా ఆఫ్రికా ప్రాంతంలో దాదాపు 25.7 మిలియన్‌ మందికి హెచ్‌ఐవీ సోకినట్లు అంచనా. అందులో 16.4 మిలియన్‌ మందికి యాంటీవైరల్‌ థెరపీ నిరంతయరాయంగా కొనసాగాల్సి ఉంది. లేనట్లయితే వారి ప్రాణాలకే ప్రమాదం. ఈ నేపథ్యంలో అనవసర మరణాలు అరికట్టాలని, యాంటీవైరల్‌ థెరపీ ప్రారంభించాలని డబ్ల్యూహెచ్‌ఓ, యూఎన్ఎయిడ్స్‌ విజ్ఞప్తి చేశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement