వారి స్మగ్లింగ్ స్టైల్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..! | Sakshi
Sakshi News home page

వారి స్మగ్లింగ్ స్టైల్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

Published Tue, Jan 19 2016 4:34 PM

వారి స్మగ్లింగ్ స్టైల్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..! - Sakshi

న్యూయార్క్: మత్తుపదార్ధాల రవాణా.. బహుశా దీనికోసం ఇప్పటివరకు ఎంచుకోని మార్గం లేదనుకుంట.. ఇకముందు కూడా మరిన్ని కొత్త మార్గాలు రాక మానవనుకుంట. గంటలుగంటలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నవారు ఎంతటి మేధావులో చెప్పలేంగానీ.. డ్రగ్ మాఫియాకు పడుతున్నవారిని మాత్రం ఏమరుపాటున కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మత్తుపదార్థాల రవాణాకోసం వారు అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే.

షూలలో, సాక్స్లలో, పెట్టెల్లో, వాహనాల టైర్లలో, పూల మొక్కల కుండీల్లో, కరిగిపోని టాబ్లెట్ల రూపంలో ఇలా ఒక్కటేమిటీ పోలీసుల కళ్లుగప్పి తమ పని పూర్తిచేసుకునేందుకు స్మగ్లర్లు అనుసరించేపద్ధతులు అన్నీ ఇన్నీ కాదు. మొన్నీమధ్యే కడుపులోపల, చెప్పుకోకూడని చోట్లలో కూడా మత్తుపదార్థాలను పెట్టుకోని రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు.

అయితే, మెక్సికోలోని డ్రగ్ మాఫియా మాత్రం పోలీసులను మోసం చేసేందుకు చేసిన ప్రయత్నం అంతాఇంతా కాదు.. వారు ఏకంగా కేరట్లాంటి కృత్రిమ క్యారెట్లను సృష్టించి వాటిల్లో గంజాయి కూర్చడమే కాకుండా.. అసలైన క్యారెట్ల మధ్య భాగంలో కూడా గంజాయి జొప్పించి తరలించే ప్రయత్నం చేశారు. దాదాపు మూడువేల క్యారెట్లను తలపించే ప్యాకెట్లను రెండు ట్రక్కుల్లో అసలైన క్యారెట్ల మధ్యలో పెట్టి ఏ మాత్రం అనుమానం రాకుండా ఉంచారు.

కానీ, అమెరికాలోని టెక్సాస్ మెక్సికో సరిహద్దులో ఆ ట్రక్కులను తనిఖీ చేసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ క్యారెట్లలో ఉన్న గంజాయి విలువ ఏకంగా 5లక్ష డాలర్లు(దాదాపు మూడున్నర కోట్లు)గా అంచనా వేశారు. దీనిని స్వాధీనం చేసుకున్న అధికారుల్లో ఒకరైన ఈఫ్రెయిన్ సోలిస్ మాట్లాడుతూ..'అమెరికా మెక్సికో సరిహద్దులో గుండా మత్తుపదార్థాల రవాణా చేసేందుకు మరోసారి స్మగ్లర్లు వారి సృజనాత్మకతను ఉపయోగించారు. అయితే, వారు ఏ రూపంలో ప్రయత్నించినా వాటిని సమూలంగా ఎదుర్కొనేందుకు మా పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా క్యారెట్లు, దోసకాయలు, టమాటాల్లో పెట్టి గంజాయి తరలించారు' అని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement