ట్యాక్సీకి టోకరా : యువతికి అరుదైన శిక్ష | Sakshi
Sakshi News home page

ట్యాక్సీకి టోకరా : యువతికి అరుదైన శిక్ష

Published Sun, May 31 2015 2:01 PM

శిక్ష అమలులో భాగంగా కారులో ప్రయాణించిన మార్గంలోనే కాలినడకన వెళుతోన్న విక్టోరియా - Sakshi

అమెరికాలోని పెన్సిల్వేనియా మున్సిపల్ కోర్టు తాజాగా ఓ అరుదైన, ఆశ్చర్యకరమైన తీర్పును వెలువరించింది. ట్యాక్సీలో ప్రయాణించి డబ్బులు చెల్లించకుండా పారిపోయిన ఓ యువతికి 30 మైళ్ల నడక శిక్షను విధించింది. దీంతో తరచూ వెరైటీ తీర్పులు ఇస్తారని పేరున్నజడ్జి మైఖేల్ కికొనెట్టీ మరోసారి వార్తల్లో నిలిచారు.

గతవారం ఒహోయోలోని లేక్ కంట్రీ నుంచి పెన్సిల్వేనియాకు ట్యాక్సీలో ప్రయాణించిన విక్టోరియా బాస్కోమ్ అనే యువతి.. తన గమ్యస్థానం వద్ద ట్యాక్సీ ఆగగానే డబ్బులివ్వకుండా చటుక్కున పారిపోయింది. కంగుతిన్న ఆ ట్యాక్సీడ్రైవర్ ఎలాగైతేనేం ఆమెను పట్టుకుని కేసుపెట్టి కోర్టుకీడ్చాడు. ఇరుపక్షాల వాదనలు విన్న పెన్సిల్వేనియా మున్సిపల్ కోర్టు జడ్జి.. విక్టోరియాను దోషిగా నిర్ధారించి ఆమె ట్యాక్సీలో ప్రయాణించిన 30 మైళ్ల (48 కిటోమీటర్ల) దూరం నడవడంతోపాటు నష్టపరిహారంగా ట్యాక్సీ డ్రైవర్ కు 100 డాలర్లు చెల్లించాలని ఆదేశించారు.

మరో గమ్మత్తేమిటంటే సదరు దోషులు శిక్ష ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాడు జడ్జి మైఖేల్! విచారణ సమయంలో 'ఒకవేళ ట్యాక్సీ దొరకకుంటే నువ్వెలా వెళ్లేదానివి' అన్ని జడ్జిప్రశ్నకు 'నడుచుకుంటూ వెళ్లేదాన్నేమో' అని విక్టోరియా సమాధానం చెప్పింది. దీంతో న్యాయమూర్తి 'లేక్ కంట్రీ జైలులో 60 రోజులు పనిచేస్తావా? లేక నువ్వు ప్రయాణించిన దూరం (48 గంటల లోపు) నడిచి వెళతావో చాయిస్ ఈజ్ యువర్స్' అని శిక్ష నిర్ణయాన్ని విక్టోరియాకే వదిలిపెట్టాడు.

మొదట పని కంటే నడకే మేలనుకున్న విక్టోరియా ఇప్పుడు మాత్రం.. 'ఏల ట్యాక్సీ ఎక్కవలె.. ఎక్కితిపో.. ఎల డబ్బులివ్వకుండా పారిపోవలె.. పారిపోతినిపో.. ఏల 30 మైళ్లు నడవవలె.. నడిస్తిపో..' అంటూ కాళ్లు ఒత్తుకుంటోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement