ఉత్తర కొరియావైపు రెండో అమెరికా యుద్ధనౌక | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియావైపు రెండో అమెరికా యుద్ధనౌక

Published Fri, May 19 2017 9:00 AM

ఉత్తర కొరియావైపు రెండో అమెరికా యుద్ధనౌక

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా, అమెరికా మధ్య యుద్ధం అనివార్యం కానుందా? తొలుత తమ యుద్ధ నౌకను ఉత్తర కొరియా సముద్ర జలాలకు దగ్గర్లో దించి బెదిరించినా లెక్కచేయకపోవడంతో అమెరికా ఆ దేశానికి తన సత్తా చూపించాలని అనుకుంటుందా? ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. మొన్నటి మొన్న ఓ యుద్ధ నౌకను ఉత్తర కొరియావైపు తీసుకెళ్లిన అమెరికా తాజాగా మరో యుద్ధ నౌకను బయటకు తీసింది. అత్యంత కీలకంగా పనిచేసే యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌ను కూడా అటువైపే పంపిస్తోంది.

ఇప్పటికే అక్కడ ఉన్న యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌, రోనాల్డ్‌ కలిసి యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు అమెరికా రక్షణశాఖ అధికారులు చెప్పారు. గత ఏప్రిల్‌ 5న, ఇటీవల ఉత్తర కొరియా మరోసారి తన బాలిస్టిక్‌ అణుక్షిపణిని పరీక్షించడం, అమెరికాపై దాడి చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటం వంటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఉత్తర కొరియా వైపు యుద్ధ నౌకలు రావడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. జపాన్‌లోని యోకోసుకాలోని హోమ్‌పోర్ట్‌లో సముద్ర తీర పర్యవేక్షణ బాధ్యతలు తాము చేసుకున్న ఒప్పందం మేర ముగిసన నేపథ్యంలో ఇప్పుడు రోనాల్డ్‌ రీగర్‌ కూడా ఉత్తర కొరియా వైపు పంపించారు. దీనితోపాటు రెండు మరో భారీ నౌకలు కూడా వెళుతున్నాయి. ‘చాలాకాలంగా నిర్వహిస్తున్న బాధ్యతలు ముగిసిన నేపథ్యంలో రోనాల్డ్‌ రీగన్‌, ఇతర దాడులకు సంబంధించిన గ్రూపులను అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. అందులో భాగంగా ప్రస్తుతం కొరియా ద్వీపకల్పం వైపు తీసుకెళుతున్నాం’ అని చార్లెస్‌ విలియమ్స్‌ అనే అధికారి చెప్పారు.

ఈ యుద్ధనౌక అక్కడికి చేరుకోగానే శిక్షణ సంబంధమైన విన్యాసాలను కార్ల్‌ విన్సన్‌తో కలిసి నిర్వహిస్తుందని తెలిపారు. యుద్ధ విమానాన్ని విజయవంతంగా ప్రయోగించడంతోపాటు తిరిగి దానిని సురక్షితంగా దించడం అనే అంశం ప్రధానంగా ఈ విన్యాసాలు ఉంటాయని చెప్పారు. వాస్తవానికి కార్ల్‌ విన్సన్‌ను తొలుత ఉత్తర కొరియా వైపు పంపించిన అమెరికా సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో విన్యాసాలు పంపించినట్లు తెలిసిందే. అయితే, తాజాగా తమ యుద్ధ నౌక ఆస్ట్రేలియాకు వెళ్లలేదని, రోనాల్డ్‌తో కలిసి పనిచేసేందుకు ఉత్తర కొరియా సమీపంలోనే సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement