భారత్‌ కోసం అమెరికా చరిత్రాత్మక నిర్ణయం | Sakshi
Sakshi News home page

భారత్‌ కోసం అమెరికా చరిత్రాత్మక నిర్ణయం

Published Thu, May 31 2018 4:50 PM

US Pacific Command Changes Name To Indo Pacific Command - Sakshi

వాషింగ్టన్‌, అమెరికా : భారత్‌ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. రక్షణ రంగంలో కూడా భారత్‌ పటిష్టమవుతోంది. తాజాగా పసిఫిక్‌ మహా సముద్రంలో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. అమెరికా ఆధ్వర్యంలో పసిఫిక్‌ సముద్రంలో ఉన్న ‘పసిఫిక్‌ కమాండ్‌’  పేరును ‘యూఎస్‌-ఇండో కమాండ్‌’ గా మారుస్తున్నట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు అమెరికా ఇస్తున్నప్రాముఖ్యతకు ఈ పేరు దోహదం చేస్తుందని పెంటగాన్‌ అధికారులు తెలిపారు. 

"పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో భాగస్వామ్య దేశాలతో మరింత బలమైన బంధాన్ని కోరుకుంటున్నాం. ఈ పరిధిలోని దేశాల్లో మరింత స్థిరత్వం కోసం ఈ పేరు మార్పు దోహదపడుతుంది" అని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ వెల్లడించారు. భారత్‌కు, పసిఫిక్ మహా సముద్రానికి కనెక్టివిటీ పెరుగుతున్న తరుణంలో తాము పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. 

అత్యాధునిక విమాన వాహక నౌకలతో పాటు, యుద్ధ నౌకలు కలిగి ఉన్న3.75 లక్షల సైనిక బృందం, గ్రేటర్ పసిఫిక్ సముద్ర ప్రాంతంలో నిఘా కాస్తోంది. ఈ కమాండ్‌కు ఇప్పటివరకూ అడ్మిరల్ హ్యారీ హారిస్ నేతృత్వం వహించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హ్యారీ హారిస్‌ దక్షిణ కొరియా రాయాబారిగా నియమించారు. దీంతో అడ్మిరల్ ఫిలిప్ డేవిడ్ సన్ ఆ కమాండ్‌కు బాధ్యతలు వహించనున్నారు.

Advertisement
Advertisement