హెచ్1బీ వీసా ఉంటే.. భార్యా జాబ్ చేయొచ్చు! | Sakshi
Sakshi News home page

హెచ్1బీ వీసా ఉంటే.. భార్యా జాబ్ చేయొచ్చు!

Published Wed, Apr 9 2014 2:31 AM

హెచ్1బీ వీసా ఉంటే..  భార్యా జాబ్ చేయొచ్చు! - Sakshi

కొత్త విధాన నిర్ణయాలు తీసుకోనున్న అమెరికా
 
 వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా తెలివైనోళ్లందరినీ తన దగ్గరకు తెచ్చుకుని పని చేయించుకోవాలనుకునే అమెరికా.. ఆ దిశగా మరో ప్రయత్నం చేస్తోంది. హెచ్-1బీ వీసా కలిగిన సాంకేతిక నిపుణుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా ఇతర దేశాల్లో ఉన్న నిపుణులను తమ దేశంవైపు ఆకర్షించాలని చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మేరకు త్వరలో పలు విధాన నిర్ణయాలు తీసుకోనున్నారు. ‘అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు, ఉద్యోగాల కల్పనకు, సృజనాత్మక పోటీతత్వాన్ని పెంచడానికి వీలుగా ప్రతిభ కలిగిన విదేశీ పారిశ్రామికవేత్తలు, ఇతర ఉత్తమ నైపుణ్యాలు కలిగిన ఇమిగ్రంట్లను మరింతగా ఆకర్షించాలనుకుంటున్నాం.

ఇందుకుగాను హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం త్వరలో కొన్ని నిబంధనలను వెల్లడించనుంది’ అని అమెరికా అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిచ్చే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయని పేర్కొంది. వీరితోపాటు ప్రతిభ కలిగిన ప్రొఫెసర్లు, పరిశోధకులకు కూడా ఉపాధి అవకాశాలు పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించింది. అయితే హెచ్-1బీ వీసా ఉన్న వారందరి జీవిత భాగస్వాములకూ ఉద్యోగ అవకాశం రాకపోవచ్చు. ప్రధానంగా శాస్త్ర-సాంకేతిక రంగాల్లో వారికే ఇది లాభించే అవకాశముందని తెలుస్తోంది.
 
 

Advertisement
Advertisement