దూరం 90 మైళ్లు.. వెళ్లడానికి 88 ఏళ్లు! | Sakshi
Sakshi News home page

దూరం 90 మైళ్లు.. వెళ్లడానికి 88 ఏళ్లు!

Published Fri, Feb 19 2016 11:28 AM

దూరం 90 మైళ్లు.. వెళ్లడానికి 88 ఏళ్లు! - Sakshi

అట్లాంటిక్ మహాసముద్రంలోకి చొచ్చుకుపోయినట్లుండే అమెరికా రాష్ట్రం ఫ్లోరిడా, క్యూబాల మధ్య దూరం 90 మైళ్లు. ఐదున్నర దశాబ్ధాలపాటు ఉప్పూ-నిప్పులా ఉన్న ఆ రెండు దేశాలు వైరం వీడి శాంతిబాటపట్టిన నేపథ్యంలో 88 ఏళ్ల తర్వాత ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది.

 

ఇప్పటికే దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలు పునరుద్ధరించుకున్నప్పటికీ దేశాధినేతల పర్యటన వెలితి అతి త్వరలో పూడనుంది. ఆ వెలితి పూడ్చబోయేది.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. సతీమణి మిషెల్లితోకలిసి ఒబామా మార్చి 21,22తేదీల్లో క్యూబాలో పర్యటిస్తారని శుక్రవారం వైట్ హౌస్ వర్గాలు తేల్చిచెప్పాయి.

 

ఒక అమెరికా అధ్యక్షుడు చివరిసారిగా క్యూబా వెళ్లింది 1928లో. నాటి ప్రెసిడెంట్ కెల్విన్ కూలిడ్జ్ పర్యటన తర్వాత ఆ దేశాల సంబంధాలు అంతకంతకూ దిగజారాయి. ఇరాక్, అఫ్టానిస్థాన్ ల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించడం, ఇరాన్ తో శాంతి ఒప్పందం తదితర చర్యలతో శాంతి కాముకుడిగా పేరుపొందిన ఒబామా 88 ఏళ్ల తర్వాత క్యూబాలో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు కావటం ఆయనపొందిన నోబెల్ శాంతి పురస్కారానికి మరింత గౌరవాన్ని ఆపాదించినట్లవుతదని కొందరిభావన.

'ఇరుదేశాల మధ్య శాంతి, సుహృద్భావం పెంపొందించేందుకు క్యూబాకు వెళతానని 14 నెలల కిందటే చెప్పా. అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సుదీర్ఘకాలం తర్వాత 'క్యాస్ట్రో' గడ్డలోని దౌత్యకార్యాలయంపై అమెరికా జెండా రెపరెపలాడటాన్ని చూడాలని నా మనసు ఉవ్విళూరుతోంది' అని ఒబామా గురువారం ట్విట్టర్ లో స్పందించారు.

శాంతి చర్చల ప్రక్రియ మొదలైనప్పటినుంచి క్యూబాకు అమెరికా టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న ఒబామా.. ఇప్పటికీ పలు అంశాల్లో తీవ్రమైన విబేధాలున్నాయని, తన పర్యటనలో వాటిని ప్రస్తావిస్తానని, అయితే రెండు దేశాలు కలిసికట్టుగా సాగటం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. తన పర్యటన తప్పక క్యూబా అభ్యున్నతికి తోడ్పడుతుందని, తద్వారా హవానా ప్రజల జీవనప్రమాణాలు మరింత మెరుగవుతాయని ఒబామా పేర్కొన్నారు. రావుల్ క్యాస్ట్రో సహా పలువురు మంత్రులు, క్యూబన్ వాణిజ్యవేత్తలతో ఒబామా చర్చలు జరుపుతారు. అనంతరం అటునుంచే అర్జెంటీనా బయలుదేరి వెళతారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement