ఆపిల్ సహాయం లేకుండానే ఐఫోన్ అన్‌లాక్ | Sakshi
Sakshi News home page

ఆపిల్ సహాయం లేకుండానే ఐఫోన్ అన్‌లాక్

Published Tue, Mar 29 2016 1:31 PM

ఆపిల్ సహాయం లేకుండానే ఐఫోన్ అన్‌లాక్ - Sakshi

కాలిఫోర్నియా: శాన్ బెర్నార్డినోలో కాల్పులు జరిపి 14 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐఫోన్‌ను ఆపిల్ కంపెనీ సహాయం లేకుండానే అమెరికా ఎఫ్‌బీఐ అన్‌లాక్ చేసింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఐలీన్ డెక్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. దీంతో ఈ విషయంలో గత కొంతకాలంగా ఆపిల్ కంపెనీతో కొనసాగుతున్న వివాదానికి తెరపడినట్లేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

శాన్ బెర్నార్డినో కాల్పుల అనంతరం జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో రిజ్వాన్ ఫరూక్ చనిపోవడం, అయన వద్ద ఐఫోన్ లభించడం, ఆ ఫోన్‌లో ఉన్న డేటాను తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ వర్గాలు ఆపిల్ కంపెనీ సహాయాన్ని అర్థించడం, అందుకు కంపెనీ నిరాకరించడంతో ఎఫ్‌బీఐ కోర్టుకు వెళ్లడం, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి ఆపిల్ కంపెనీ నిరాకరించడం, ఆ కంపెనీకి గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు అండగా నిలబడడం తదితర పరిణామాలు తెల్సినవే.

ఎఫ్‌బీఐ థర్డ్ పార్టీ సహాయంతో ఐఫోన్‌ను అన్‌లాక్ చేయించిన విషయం తెలిసిందో ఏమో గానీ ఆపిల్ కంపెనీ కూడా చివరకు ఎఫ్‌బీఐకి సహకరించేందుకు అంగీకరించింది. ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఇస్తామని సోమవారమే ప్రకటించింది. ఐఫోన్‌నే కాకుండా ఏ ఫోన్‌నునైనా అన్‌లాక్ చేసేందుకు థర్డ్ పార్టీ సహకారం తమకు ఉందని, ఈ విషయంలో ఆపిల్ కంపెనీ సహాయ సహకారాలు తమకు అవసరం లేదని డెక్కర్ వివరించారు. అయితే ఆ థర్డ్ పార్టీ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'సెలెబ్రైట్'కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు ఐఫోన్‌ను అన్‌లాక్ చేసినట్లు ఓ ఇజ్రాయెల్ వార్తాపత్రిక తెలిపింది. ఈ కేసులో తాము ఎఫ్‌బీఐకి సహకరించినట్లు సెలెబ్రైట్ అంగీకరించింది. అయితే ఎలాంటి సహాయం చేసిందనే వివరాలను మాత్రం వెల్లడించడానికి నిరాకరించింది.

Advertisement
Advertisement