చైనాకు తూచ్.. భారత్‌కే అమెరికా మద్దతు! | Sakshi
Sakshi News home page

చైనాకు తూచ్.. భారత్‌కే అమెరికా మద్దతు!

Published Sat, May 14 2016 6:01 PM

చైనాకు తూచ్.. భారత్‌కే అమెరికా మద్దతు! - Sakshi

చైనాను తోసిరాజని.. భారతదేశానికి అమెరికా అండగా నిలిచింది. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్ వద్దని ఎంత మొత్తుకుంటున్నా.. భారతదేశం మాత్రం అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో చేరడం ఖాయమని అమెరికా బల్లగుద్ది చెబుతోంది. ఎన్‌ఎస్‌జీలో భారత్ చేరడాన్ని చైనా వ్యతిరేకించిన కొద్ది గంటల్లోనే భారతదేశానికి మద్దతుగా అమెరికా ముందుకొచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లోనే చెప్పిన విషయాన్ని అమెరికా హోంశాఖ ప్రతినిధి జాన్ కిర్బీ గుర్తుచేశారు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ నిబంధనలను భారతదేశం పాటిస్తోందని, అందువల్ల అణు సరఫరాదారుల బృందంలో చేరడానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని కిర్బీ అన్నారు. చైనా, పాకిస్థాన్ మాత్రం భారత సభ్యత్వం విషయంలో ముందునుంచే వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. భారతదేశంతో తమకున్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని అనవసరంగా పాకిస్థాన్‌ను వాడుకోవడం చైనాకు తగదని కూడా అమెరికా భావిస్తున్నట్లు ఇటీవల అమెరికా మీడియా తెలిపింది.

48 దేశాలతో కూడిన ఎన్ఎస్‌జీ బృందాన్ని విస్తరించాలంటే ఎన్‌పీటీ మీద సంతకం చేయడం ముఖ్యమని చైనా వాదిస్తోంది. అయితే.. భారత్‌ను పాకిస్థాన్‌ లాంటి దేశంతో పోల్చడం సరికాదని, లిబియా లాంటి దుష్టదేశాలకు పాకిస్థాన్ అణు టెక్నాలజీని అమ్ముతోందని అమెరికా చెబుతోంది. పాకిస్థాన్ అణు పితామహుడు డాక్టర్ ఎ.క్యు. ఖాన్ కూడా అంతర్జాతీయంగా అణు వ్యాపారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తోంది. అణ్వస్త్రాలు లేని దేశంగా తాము ఉంటామంటూ సంతకం చేయాల్సిన ఎన్‌పీటీలో తాము చేరే ప్రసక్తి లేదని భారతదేశం ఎప్పుడో తన విధానాన్ని స్పష్టం చేసింది. దేశ భద్రత దృష్ట్యా అవి తప్పనిసరని చెబుతోంది. పైపెచ్చు, ఆ ఒప్పందం చాలా వివక్షాపూరితంగా ఉందని కూడా భారత్ వాదిస్తోంది.

Advertisement
Advertisement