Sakshi News home page

ఆ ‘వీడియో’ చైనా మార్కెట్‌ది కాదు!

Published Wed, Feb 5 2020 1:45 PM

That Video Not Belong to China Wuhan Market - Sakshi

వుహాన్‌ : ‘కరోనావైరస్‌ బయట పడిన చైనాలోని వుహాన్‌ మార్కెట్‌ ఇదే. ఈ మార్కెట్‌లో తిరగడానికి దెయ్యాలు కూడా భయపడతాయి. కరోనా వైరస్‌ జన్మస్థలం ఇదే!’ అంటూ నాలుగు నిమిషాల నలభై సెకండ్ల నిడివి కలిగిన వీడియోను దీపక్‌ మౌర్య అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ ఫిబ్రవరి రెండవ తేదీన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దాన్ని ఇప్పటికే 50 వేల మంది వీక్షించారు. (చదవండి: కరోనా కేసులు 20,522)

‘చైనాలోని వుహాన్‌ మార్కెట్‌. కరోనా వైరస్‌ జన్మస్థలం’ అంటూ 44 సెకండ్ల వీడియోను జీతూ షాజీ వర్గీస్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ జనవరి 30వ తేదీన పోస్ట్‌ చేశారు. ఈ రెండు వీడియోలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చైనా మార్కెట్‌ ఇంత భయానకంగా ఉంటే కరోనా వైరస్‌లు ఎందుకు పుట్టుకరావంటూ! సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.



దీపక్‌ మౌర్య, జీతూ షాజీ వర్గీస్‌ ఇరువురు పోస్ట్‌ చేసిన వీడియో స్క్రీన్‌పైన ‘పసర్‌ ఎక్స్‌ట్రీమ్‌ లాంగోవన్‌’ అనే వాక్యం ఫ్లాష్‌ అవుతోంది. దాన్ని క్లూగా తీసుకొని ‘ఆల్ట్‌ న్యూస్‌’ యూట్యూబ్‌లో శోధించగా, 2019, జూలై నెలలో జెర్రీ మెవెంగ్‌కాంగ్‌ మొదటిసారి ఆ వీడియోను పోస్ట్‌ చేసినట్లు తెల్సింది. 4 నిమిషాల 41 సెకండ్ల నిడివిగల ఆ వీడియో ఇండోనేసియాలోని లాంగోవన్‌ మార్కెట్‌కు సంబంధించినది తేలింది. ఈ విషయాన్ని తాము ముందే కనుగొన్నామని ‘అసోసియేషన్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ ప్రొఫెషనల్స్‌’ వెల్లడించింది.



ఆ మార్కెట్‌లో రోస్ట్‌ చేసిన గబ్బిలాలు, వేయించిన ఎలుకలు, కాల్చిన పంది కాళ్లు, నలగొట్టిన పాములు విరివిగా దొరుకుతాయంటూ ఇంగ్లండ్‌కు చెందిన ‘డెయిలీ మెయిల్‌’ పత్రిక గతంలోనే ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. (చదవండి: కరోనా వైరస్‌: విస్కీతో విరుగుడు!)

Advertisement
Advertisement