‘రక్తం’లో స్నానం చేసే పుతిన్‌ | Sakshi
Sakshi News home page

‘రక్తం’లో స్నానం చేసే పుతిన్‌

Published Thu, Jul 20 2017 4:36 PM

‘రక్తం’లో స్నానం చేసే పుతిన్‌

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్, 64 ఏళ్ల వయస్సులో కూడా బలిష్టంగా కనిపించడానికి కారణం రోజు వ్యాయామం చేయడం ఒక్కటే కారణం కాదట. ఆయన తరచుగా దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేస్తారట. అలా చేయడం వల్ల శరీరంలోని ఎముకలు, కండరాలు, నడుము, కీళ్లు బలంగా తయారవడమే కాకుండా లైంగిక పటుత్వ శక్తి గణనీయంగా పెరుగుతుందట. దష్టి, వినికిడి శక్తి కూడా పెరుగుతుందట. అందుకే పుతిన్‌ తరచుగా రష్యాలోని అల్తాయ్‌ పర్వత ప్రాంతాలకు వెళతారట. ఇటీవల ఆయన అక్కడికి వెళ్లినప్పుడు అధికారులు 70 కిలోల దుప్పి కొమ్ములను విరిచి అందులో నుంచి రక్తం తీసి స్నానానికి సిద్ధం చేశారట. అందులో పుతిన్‌ తనువుతీర జలకాలాడారట. ఈ విషయాలను స్థానిక పత్రిక ‘రిపబ్లిక్‌’ వెల్లడించింది.

దుప్పి, ముఖ్యంగా మరల్‌ లేదా రెడ్‌ దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేస్తే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని, వయస్సు అంత తొందరగా మీద పడదనే నమ్మకం రష్యాలో ప్రాచీనమైనది. మనిషిలో లైంగిక పటుత్వాన్ని పెంచే ‘టెస్టోస్టెరేన్‌’ దుప్పి రక్తం వల్ల పెరిగుతుందని నమ్మి, వాటి రక్తంలో మునిగి స్నానం చేసే వారు ఇప్పటికీ రష్యాలో ఎంతో మంది ఉన్నారు. లైంగిక పటుత్వాన్ని పెంచే చైనా ఉత్పత్తుల్లో కూడా దుప్పి రక్తాన్ని ఎక్కువగా వాడుతుంటారు. నిమోనియా, ఆస్తమా, ఆస్టియోపొరోసిస్, ప్లూరిసీలాంటి జబ్బులకు, వెన్నుముక సమస్యలకు దుప్పి కర్తం బలేగా పనిచేస్తుందట.

వ్లాదిమీర్‌ పుతిన్‌ పదేళ్ల క్రితం తన మిత్రుడైన అప్పటి దేశ ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వదెవ్‌ ద్వారా దుప్పి కొమ్ముల రక్తంలో ఉండే ఔషధ గుణాల గురించి మొదటిసారి తెలుసుకున్నారట. మెద్వదెవ్‌ కూడా దుప్పి రక్తంలో స్నానం చేస్తారని అప్పట్లో విస్తత ప్రచారం ఉండేది. దుప్పి రక్తం గొప్పతనం గురించి స్వయంగా తెలుసుకునేందుకు పుతిన్‌ మరల్‌ బ్లడ్‌ వైద్య నిపుణుడు అలెగ్జాండర్‌ జుకోవ్‌ను కలుసుకున్నారట. ఇటలీ మాజీ ప్రధాన మంత్రి సిల్వియో బెర్లూస్కీ 2015లో సైబీరియా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కూడా దుప్పి కొమ్ముల రక్త రహస్యం గురించి పుతిన్‌ చెప్పారట. బెర్లూస్కీ 70వ దశకంలో కూడా శంగార లీలలు నెరపిన వైనం ప్రపంచానికి తెల్సిందేకదా! పుతిన్‌పై స్థానిక పత్రికలో వచ్చిన ఈ కథనాన్ని చదివిన జంతు ప్రేమికులు మాత్రం ఆయనపై మండిపడుతున్నారు.

Advertisement
Advertisement