ప్రజాభిప్రాయం స్వాతంత్య్రమే | Sakshi
Sakshi News home page

ప్రజాభిప్రాయం స్వాతంత్య్రమే

Published Tue, May 13 2014 1:26 AM

ప్రజాభిప్రాయం స్వాతంత్య్రమే

డోనెట్సెక్ ప్రావిన్స్ రెబెల్స్ ప్రకటన
ఉక్రెయిన్ విచ్ఛిన్నం అనివార్యం!

 
 డోనెట్సెక్/మాస్కో:ఉక్రెయిన్‌లో అంతర్గత సంక్షోభం ముదిరిపోవటంతో మరో విచ్ఛిన్నం అనివార్యంగా మారింది. ఉక్రెయిన్ నుంచి విడిపోవాలని, స్వతంత్ర దేశంగా మారి రష్యాలో చేరాలని డోనెట్సెక్ ప్రావిన్స్ మెజారిటీ ఓటర్లు రిఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ)లో తీర్పు ఇచ్చారని.. రష్యా అనుకూల తిరుగుబాటుదార్లు ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డోనెట్సెక్ పొరుగు రాష్ట్రమైన లుగాంస్క్‌లో కూడా ఇదే తరహా రిఫరెండం జరిగినప్పటికీ.. ఆ ఫలితాలను ప్రకటించలేదు. ఈ రిఫరెండం అక్రమమని, బూటకమని ఉక్రెయిన్ సహా అమెరికా, ఐరోపా దేశాలు మండిపడుతుండగా.. స్వీయపాలన కోసం రిఫరెండం ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని రష్యా ప్రకటించింది. అయితే రష్యాలో చేర్చుకోవాలన్న డోనెట్సెక్ ప్రకటనపై ఆ దేశం స్పందించలేదు.

 ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డోనెట్సెక్, లుగాంస్క్ ప్రావిన్స్‌లలో తిరుగుబాటుదార్లు స్వాతంత్య్రం కోసం ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని 4.6 కోట్ల మంది జనాభాలో ఈ రెండు ప్రావిన్స్‌లలో 70 లక్షల మంది (డోనెట్సెక్‌లో 44 లక్షలు, లుగాంస్క్‌లో 22 లక్షల మంది) ఉన్నారు. రష్యా అనుకూల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్ సైనిక బలగాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో.. విదేశీ మీడియాకు అనుమతి ఇవ్వకుండా ఈ రిఫరెండాలు నిర్వహించారు. డోనెట్సెక్ రెఫరెండం ఫలితాలను తిరుగుబాటుదార్లు ఏర్పాటు చేసుకున్న ఎన్నికల కమిషన్ చీఫ్ రోమన్‌ల్యాగిన్ ఆదివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. మొత్తం 75 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనగా అందులో 89 శాతం మంది స్వాతంత్య్రానికి అనుకూలంగా తీర్పునిచ్చారని.. 10 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారని ఆయన డోనెట్సెక్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ విచ్ఛిన్నమవుతుందని.. యూరప్ తూర్పు కొసలో అంతర్యుద్ధం రాజుకుంటుందని పాశ్చాత్యదేశాలు ఆందోళన చెందుతున్నాయి.
 

Advertisement
Advertisement