Sakshi News home page

అమెరికా వీసా అందాలంటే..

Published Fri, Jan 5 2018 7:04 PM

what we will do for america visa - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికా విద్య, ఉద్యోగావకాశాలకు పెట్టింది పేరు. అమెరికాలో విద్య, ఉద్యోగం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అందుకోసం ఏటా లక్షల సంఖ్యలో వీసా దరఖాస్తులు వస్తుంటాయి. వీసా దరఖాస్తుల ఆమోదంలో ఉన్న క్లిష్ట దశలకు తోడు ఇటీవల ఉద్యోగ వీసాల నిబంధనలు కఠినతరం చేయాలని, çస్వదేశీ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా గ్రీన్‌కార్డ్‌ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌–1బీ వీసాను పొడిగించవద్దనే ట్రంప్‌ సర్కారు సరికొత్త ప్రతిపాదనల నేపథ్యంలో హెచ్‌–1బీ, ఈబీ–5 వీసా నిబంధనలపై విశ్లేషణ...

హెచ్‌–1బీ వీసా
అమెరికా వీసాల్లో ప్రముఖమైంది.. హెచ్‌1 బీ వీసా. ఇది ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్, మెడిసిన్, ఐటీ రంగాలకు చెందిన వివిధ దేశాల నిపుణులు యూఎస్‌లో పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది. అంటే.. విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలోని సంస్థల్లో పనిచేయడానికి అమెరికా ప్రభుత్వం జారీచేసే తాత్కాలిక వర్క్‌ వీసా అన్నమాట. ఈ వీసాకి సంబంధించి మొత్తం బాధ్యత సంస్థలే తీసుకుంటాయి. సదరు సంస్థ తాను నియమించుకోబోయే వ్యక్తి వీసా కోసం యూఎస్‌ ఇమిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఏటా  65 వేల మందికి మాత్రమే కంప్యూటర్‌ లాటరీ పద్ధతిలో ఈ వీసాలు మంజూరు చేస్తుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నతవిద్య పూర్తిచేసిన వారికి అదనంగా మరో 20 వేల హెచ్‌–1బీ వీసాలు జారీ చేయొచ్చు. ప్రాథమికంగా మూడేళ్లకు వీసా మంజూరు చేస్తారు. తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం ప్రస్తుత లాటరీ విధానం స్థానంలో మరింత కఠిన విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అలాగే ప్రవేశస్థాయి ‘కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌’ను ప్రత్యేక వృత్తి నిపుణుడిగా పరిగణించడం లేదు.

కొత్త నిబంధనలివే..!
సాధారణంగా ఐటీ ఉద్యోగులకు సగటు వార్షిక వేతనం 60–70 వేల డాలర్లు ఉంటుంది. అన్నీ కలిపినా వార్షిక వేతనం 90 వేల డాలర్లు దాటదు. గతంలో 60 వేల అమెరికన్‌ డాలర్ల వార్షిక వేతనం ఉంటే వారు హెచ్‌–1 బీ వీసాకు అర్హులు. కానీ, ఇప్పుడు దాన్ని 130 వేల డాలర్లకు పెంచారు. అంటే.. మూడేళ్ల అనుభవం ద్వారా వచ్చే హైక్‌తో దాదాపు సమానం. ఈ నిబంధన కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారితోపాటు ఇప్పటికే హెచ్‌–1 బీ వీసాతో అమెరికాలో కొలువులో చేరి మూడేళ్ల కాలంలో వివిధ కారణాలతో ఉద్యోగం మానేసిన, సంస్థ తొలగించిన వారిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా కాకుండా సంస్థలో దాదాపు రెండన్నర ఏళ్ల పాటు సర్వీస్‌లో ఉంటే తమ నైపుణ్యాలతో సంస్థ మన్నన లు పొందినట్లు లెక్క. వీరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వారికి సంస్థలు 130 వేల డాలర్ల వార్షిక వేతనం లభిస్తే అక్కడే ఉంచుతున్నాయి.

తాజా నిబంధనలు
ఆరేళ్ల పాటు హెచ్‌–1బీ వీసాతో ఉన్నవారు గ్రీన్‌కార్డ్‌కు దరఖాస్తు చేసుకొని... అది మంజూరుకాకుంటే.. అలాంటివారి వీసా గడువు పొడిగించకూడదని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తాజాగా ప్రతిపాదించింది. అలాంటి వారిని స్వదేశాలకు పంపించి వేయాలని చెబుతోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే  5 లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మరోవైపు హెచ్‌1బీ వీసాదారులు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవడానికి వీలయ్యేలా ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదన చేసింది. అయితే ప్రతి ఉద్యోగానికి అనుమతి తప్పనిసరని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టం చేసింది. ఉద్యోగి విధుల్లో చేరే ముందు సంబంధిత సంస్థ యాజమాన్యం యూఎస్‌సీఐఎస్‌కి ఐ–129 ఫామ్‌ని తప్పనిసరిగా సమర్పించాలి. అందులో సదరు ఉద్యోగి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్‌ డిగ్రీ పూర్తిచేసిన వారు ఇందుకు అర్హులు.

సీపీటీ, ఓపీటీ
ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు అక్కడి నిబంధనల మేరకు మొదటి ఏడాది పూర్తయ్యే వరకు ఉద్యోగాలు చేయకూడదు. ఆ తర్వాత నుంచి రెండు పద్ధతుల్లో అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. ఒకటి కరిక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (సీపీటీ), రెండోది ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ). మొదటిది పూర్తిగా ఇంటర్న్‌షిప్‌లో చేయాల్సి ఉంటుంది. రెండోది చదువుతూ, చదువు అయిపోయిన తర్వాత కూడా 36 నెలల వరకు ఉద్యోగం చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఈబీ–5..
అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఉన్న మార్గాల్లో ‘ఈబీ–5 వీసా’ మరొకటి. దీన్ని ‘గోల్డెన్‌ వీసా, ఇన్వెస్టర్‌ వీసా’ అని కూడా అంటారు. విదేశీ వ్యాపారులను ఆహ్వానించడం, అమెరికాను ఆర్థిక పథంలో నడిపించేందుకు అవసరమైన పరిశ్రమలను స్థాపించడం, అమెరికన్‌ యువతకు ఉపాధి కల్పించడం అనే లక్ష్యాలతో 1990లో యూఎస్‌ కాంగ్రెస్‌ ఈబీ–5 ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమమైన మార్గం. హెచ్‌–1బీ వీసాపై అక్కడ ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాలను కూడా అమెరికాకు తీసుకెళ్లాలనే వారికి ఈబీ–5 వీసా అవకాశం కల్పిస్తోంది. ఈబీ–5 వీసాల దరఖాస్తుకు గడువును ఈనెల 22 వరకు పొడిగించారు.

నిబంధనలు
సొంతగా సంస్థను ఏర్పాటు చేయాలి.
1990 తర్వాత అమెరికాలో ఏర్పాటైన సంస్థలో పెట్టుబడి పెట్టడం మరో మార్గం.
1990 కంటే ముందు అమెరికాలో ఏర్పాటై, మూతపడిన సంస్థలను కొనుగోలు చేసి కార్యకలాపాలు పునరుద్ధరించడం.
ఇక్కడ ఏర్పాటు చేసిన సంస్థలో కనీసం పది మంది అమెరికన్లకు శాశ్వత ఉద్యోగం కల్పించాలి. వారానికి కనీసం 35 గంటలు పని కల్పించాలి.
నిరుద్యోగిత అధికంగా ఉన్న ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారం చేయదలచుకున్న వారు కనీసం 5 లక్షల డాలర్లు (రూ.3.17 కోట్లు) పెట్టుబడిగా పెట్టాలి.
ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేయదలచుకుంటే పది లక్షల డాలర్ల (రూ.6.34 కోట్లు) పెట్టుబడి తప్పనిసరి.

దరఖాస్తు విధానం
ఈబీ–5 వీసా కోసం తొలుత ఐ–526 (ఇమిగ్రేషన్‌ పిటిషన్‌) ఫామ్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఐ–526కు అనుమతి లభిస్తే శాశ్వత నివాసం కోసం ఐ–485 ద్వారా దరఖాస్తు చేయాలి.
ఈ రెండూ లభిస్తే ఇమిగ్రెంట్‌ వీసా కోసం డీఎస్‌–260 ఫామ్‌ను ఆన్‌లైన్‌ విధానంలో సబ్మిట్‌ చేయాలి.
ఐ–485కు అనుమతి లభిస్తే సదరు ఔత్సాహిక వ్యాపారవేత్తకు, జీవిత భాగస్వామికి, కుటుంబంలో 21 ఏళ్లలోపు వయసున్న వారందరికీ.. రెండేళ్ల కాల పరిమితితో కూడిన నివాస హోదాకు అనుమతిస్తారు.
తర్వాత రెండేళ్ల వ్యవధి ముగియడానికి 90 రోజులు ముందుగా ఐ–829 ద్వారా దరఖాస్తు చేసుకుంటే పర్మనెంట్‌ రెసిడెన్సీ అవకాశం కల్పిస్తారు.
యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ధ్రువీకరించిన ప్రాంతీయ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
ప్రస్తుతం అమెరికాలో 835 ప్రాంతీయ కేంద్రాలు విధులు నిర్వహిస్తున్నాయి.
ఈబీ–5 వీసా దరఖాస్తుకు ప్రతి సంవత్సరం నిర్దిష్ట తేదీలను నిర్ణయిస్తారు.
స్టూడెంట్‌ వీసా, వర్క్‌ వీసా విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం.. కొత్త సంస్థలు ఏర్పాటు అవుతుండటం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తుండటంతో ఈబీ–5 వీసాల విషయంలో మాత్రం సరళీకృతంగా వ్యవహరిస్తోంది.  

ఇవీ లాభాలు
ఈ వీసా తీసుకుంటే గ్రీన్‌కార్డు రావడానికి అవసర మైన కాలపరిమితి తగ్గిస్తారు.
పెట్టుబడి పెట్టినవారి పిల్లలు ఎలాంటి కార్పొరేట్‌ స్పాన్సర్‌షిప్‌ లేకుండా యూఎస్‌లో స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు.
శాశ్వత నివాసం పొందొచ్చు.

Advertisement
Advertisement