ఇదీ పారిస్‌ ఒప్పందం.. | Sakshi
Sakshi News home page

ఇదీ పారిస్‌ ఒప్పందం..

Published Sat, Jun 3 2017 1:15 AM

ఇదీ పారిస్‌ ఒప్పందం.. - Sakshi

పెట్రోలు, డీజిల్‌ వంటి ఇంధనాల విచ్చలవిడి వాడకం, పారిశ్రామికీకరణతో భూగోళం వేడెక్కుతోంది. పరిస్థితి మారకపోతే  కార్బన్‌డయాక్సైడ్‌ వంటి గ్రీన్‌హౌస్‌ వాయువుల మోతాదు పెరిగి అనేక విపరిణామాలు చోటు చేసుకుంటాయి. అకాల వర్షాలు, వరదలు, కరువు వంటి అనేక అనర్థాలు కలగనున్నాయి.

ఈ విపత్తు నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలన్నీ కుదర్చుకున్నదే పారిస్‌ ఒప్పందం. రెండేళ్ల క్రితం దీన్ని ప్రతిపాదించగా.. 195 దేశాలు సంతకాలు చేశాయి. గత ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్నది ఈ ఒప్పందం లక్ష్యం. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి చర్యలతో దీన్ని సాధించాలన్నది సంకల్పం.

ఒప్పందంలో అమెరికాదే కీలకపాత్ర
ఈ ఒప్పందం చట్టం కాదు. అందువల్ల అన్ని దేశాలు కచ్చితంగా అమలుచేయాల్సిన అవసరం లేదు. ఉద్గారాల తగ్గింపునకు ఏ చర్యలు తీసుకోనున్నారో, ఎంత పురోగతి సాధించారో ఆయా దేశాలు నిర్ణీత కాలవ్యవధిలో ప్రకటించాలి. ఇందులో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా 2025 నాటికల్లా కర్బన ఉద్గారాలను 26 నుంచి 28 శాతం (2005 నాటి స్థాయి) తగ్గిస్తామని ప్రకటించారు.

ఇతర దేశాలు తమ లక్ష్యాలను చేరుకునేలా ఇంతవరకూ అధిక కాలుష్యానికి కారణమైన అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా సాయపడాలి. ప్రపంచదేశాలన్నీ భాగస్వాములుగా ఉన్న యునైటెడ్‌ నేషన్స్‌ గ్రీన్‌ క్లైమెట్‌ ఫండ్‌కు ఏటా రూ. 6.5 లక్షల కోట్లు జమ చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఒబామా అమెరికా తరఫున వంద కోట్ల డాలర్లు అందజేశారు. అయితే అమెరికా తాజా బడ్జెట్‌లో ఈ నిధి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

ట్రంప్‌ నిర్ణయం వెనుక.. భూతాపోన్నతి, వాతావరణ మార్పులపై ట్రంప్‌కు నమ్మకం లేదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఇవన్నీ చైనా కుట్రగా పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని చైనా తగ్గించుకోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు.  పలు ద్వైపాక్షిక ఒప్పందాలతో అమెరికాకు ప్రయోజనం లేదని, పారిస్‌ ఒప్పందమూ అలాంటిదేనని ట్రంప్‌ అభిప్రాయం. కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఒబామా విధించిన ఆంక్షలు, పెట్టాలనుకున్న ఖర్చు అమెరికా వృద్ధిని అడ్డుకుంటుందని ట్రంప్‌ భావిస్తున్నారు.  ఒబామా హయాంలో బొగ్గు వాడకాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన క్లీన్‌ పవర్‌ ప్లాన్‌ను రద్దు చేయగా.. అధ్యక్షుడిగా ఎన్నికైతే బొగ్గు గనులు, విద్యుత్‌ ప్లాంట్‌లను పునరుద్ధరిస్తానని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.

అమెరికా వైదొలిగితే ఏమవుతుంది..?
అమెరికా వైదొలిగితే పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే. 2025 నాటికల్లా 200 కోట్ల టన్నుల ఉద్గారాల్ని అమెరికా తగ్గించాలన్నది ఒబామా లక్ష్యం. అమెరికా తప్పుకోవడం వల్ల మిగిలిన దేశాలపై ఆ భారం పడనుంది. సాంకేతికంగా చూస్తే అమెరికా ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగేందుకు మరో నాలుగేళ్ల సమయం పడుతుంది.

వైదొలగాలనుకునే దేశం మూడేళ్ల ముందుగా నోటీసు ఇవ్వాలి. నోటీసు కాలం తర్వాత మరో ఏడాది గడిచాక... ఒప్పందం నుంచి వైదొలిగినట్లు. ఈ లోపు సౌర, పవన విద్యుత్తులను మరింత చౌక చేసేందుకు ఒబామా చేపట్టిన చర్యల్ని ట్రంప్‌ నిలిపివేయవచ్చు. భారత్, చైనా వంటి దేశాలు ఈ అంశాన్ని బలంగా మార్చుకుని కొత్త టెక్నాలజీ అభివృద్ధికి, పరిశోధనలకు ఊతమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement
Advertisement