తోమహాక్ క్షిపణులే ఎందుకు? | Sakshi
Sakshi News home page

తోమహాక్ క్షిపణులే ఎందుకు?

Published Fri, Apr 7 2017 10:48 AM

తోమహాక్ క్షిపణులే ఎందుకు? - Sakshi

అమెరికా నౌకాదళం సిరియా మీద దాడులకు ఉపయోగించుకున్న ప్రధానాస్త్రం.. తోమహాక్ క్షిపణులు. చాలా దూరం నుంచి ప్రయోగించినా కూడా కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం వీటికి ఉంటుంది. 1991 ప్రాంతంలో జరిగిన గల్ఫ్ యుద్ధంలో కూడా అమెరికా వీటిని విస్తృతంగా ఉపయపోగించింది. వీటికి సాధారణంగా 455 కిలోల వార్‌హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. చిట్టచివరిసారిగా వీటిని ఎర్ర సముద్రం నుంచి యెమెన్‌లోని కోస్టల్ రాడార్ సైట్ల మీద పెంటగాన్ ప్రయోగించింది. అమెరికా నౌకల మీద హౌతీ రెబెల్స్ క్షిపణిదాడులు చేయడంతో వారిని అడ్డుకునేందుకు వీటిని వేసింది. ఇక తాజాగా సిరియా వైమానిక స్థావరం మీద చేసిన దాడుల కోసం.. మధ్యధరా సముద్రంలో ఉన్న యుద్ధనౌకల మీద నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారు.

తోమహాక్ క్షిపణులను ప్రయోగించాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దాదాపు 1600 కిలోమీటర్ల దూరం నుంచి వీటిని నౌకాదళం ప్రయోగించగలదు. అంత దూరంలో ఉన్న నౌకల మీదకు శత్రువులు తమ వాయుసేనతో వచ్చేందుకు కూడా వెంటనే అవకాశం ఉండదు. తోమహాక్ క్షిపణుల కంటే కూడా అమెరికా సైనిక విమానాలు ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలవు. కానీ, వాటిని తప్పనిసరిగా మనుషులే నడపాల్సి ఉంటుంది. శత్రుసేనలు వాటిమీద సులభంగా దాడి చేయగలవు. తోమహాక్ క్షిపణుల్లో కొన్ని క్లస్టర్ బాంబులను కూడా తీసుకెళ్లి, వాటిని టార్గెట్‌ మీద విరజిమ్మగలవు. దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా ధ్వంసం అవుతాయి. అయితే యుద్ధ విమానాల నుంచి వదిలే బాంబులు మరింత ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. ఒకవేళ యుద్ధవిమానాలు వాడాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకుంటే, అప్పుడు తప్పనిసరిగా నౌకాదళ విమానాలే వాడాల్సి ఉంటుంది. అంటే హారియర్ జెట్లు అన్నమాట.

సిరియా సైన్యం ఎక్కువగా ఎస్-200 తరహా భూమ్మీద నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులను వాడుతుంది. అయితే, వాళ్లకు అండగా ఉన్న రష్యన్ సైన్యం మాత్రం ఎస్-300, ఎస్-400 తరహా క్షిపణులు వాడగలదు. ఇవి మామూలు వాటి కంటే చాలా వేగంగా వెళ్తాయి. వాటికి రాడార్ వ్యవస్థ కూడా ఉంటుంది. అమెరికా సైన్యం మాత్రం కొంతవరకు ఈఏ-18జి గ్రౌలర్ జెట్, ఇతర సాధనాలతో రష్యాన్ రాడార్లను జామ్ చేయగలదు. ఆ జామర్లను కూడా అధిగమించే సామర్థ్యం రష్యా దగ్గరున్న ఎస్-400 తరహా క్షిపణులకు ఉంటుంది.

Advertisement
Advertisement