పెద్ద మాఫియాను నడుపుతున్నకోతులు | Sakshi
Sakshi News home page

పెద్ద మాఫియాను నడుపుతున్నకోతులు

Published Mon, Jun 5 2017 5:10 PM

పెద్ద మాఫియాను నడుపుతున్నకోతులు

జకార్తా: అక్కడ కోతులే గ్రూపులుగా మారి పెద్ద మాఫియాను నడుపుతున్నాయి. విలువైన వాటిని ఎత్తుకుపోయి వాటికి కావాల్సిన ఆహారాన్ని దర్జాగా రాబట్టుకుంటున్నాయి. ఇండోనేషియాలోని ఓ ఆలయంలో ఈ విడ్డూరం నడుస్తోంది. ఆలయానికి వచ్చే యాత్రికుల నుంచి గ్లాసులు, టోపీలు, కెమెరాలు, నగదు ఇతర విలువైన వస్తువులను ఎత్తుకుపోతున్న కోతులు తమకు కావాల్సిన ఆహార పదార్థాల కోసం వాటిని బేరానికి పెడుతున్నాయి. బాధితులు తాము పోగొట్టుకున్న వాటిని తిరిగి రాబట్టుకోవాలంటే కోతులతో బేరమాడక తప్పటం లేదు. ఈ బేరం గనక వాటికి నచ్చితే  ఆహార పదార్థాలను తీసుకుని, అందుకు బదులుగా తమ వద్ద ఉన్న వస్తువులను తిరిగి ఇచ్చేస్తున్నాయి.
 
ఈ రకమైన మాఫియాను అక్కడి కోతుల గుంపు కొంతకాలంగా నిర్విఘ్నంగా నడిపిస్తోంది. ఈ వింత ఇండోనేసియా బాలి దీవిలోని ఉలువాతు ఆలయ పరిసరాల్లో జరుగుతోందని బెల్జియంలోని లీజ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు ఫేనీ బ్రొట్‌కార్న్‌తేల్చారు. ఉలువాతు ఆలయ పరిసరాల్లో ఉండే నాలుగు కోతుల గుంపు చేస్తున్న చేష్టలను ఫేజీ బ్రొట్‌కార్న్‌ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం నాలుగు నెలల పాటు అధ్యయనం చేసింది. ఇది ఇక్కడి కోతులకు మాత్రమే ఉన్న ప్రత్యేక అలవాటుగా పరిశోధకులు చెబుతున్నారు.
 
సమూహాలుగా తిరిగే కోతులు కేవలం పరిశీలన ద్వారానే తమ పూర్వీకుల నుంచి ఇలాంటి ప్రక్రియను అలవాటు చేసుకుని ఆవలంభిస్తున‍్నట్లు గుర్తించారు. వస్తుమార్పిడి, వ్యాపార మెళకువలు మానవులకు మాత్రమే ప్రత్యేకమైన నైపుణ్యాలు. కాగా కోతులు కూడా ఇటువంటి మెలకువలు అలవాటు చేసుకోవటంపై మరింత పరిశోధన సాగిస్తే ఆది మానవుల గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement