నడిరోడ్డులో యువతికి బెత్తం దెబ్బలు | Sakshi
Sakshi News home page

నడిరోడ్డులో యువతికి బెత్తం దెబ్బలు

Published Tue, Oct 18 2016 3:10 PM

నడిరోడ్డులో యువతికి బెత్తం దెబ్బలు

అక్కడ కొన్ని వందల మంది చుట్టూ నిల్చుని వినోదం చూస్తున్నారు. ఆ గుంపు మధ్యలో నిలబడి ఉన్న యువతి బాధతో విలవిల్లాడిపోతూ కేకలు పెడుతోంది. అది చూసి వాళ్లంతా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు అరుస్తోందో తెలుసా.. ఇస్లామిక్ చట్లాలను ఉల్లంఘించినందుకు ఆమెను బెత్తం పెట్టి నడివీధిలో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. ఈ ఆటవిక చర్య.. ఇండోనేషియాలో తాజాగా వెలుగుచూసింది. ఇండోనేషియాలోని చాలా రాష్ట్రాల్లో షరియా చట్టాన్ని గట్టిగా అమలుచేస్తారు. జూదం ఆడినా, మద్యం తాగినా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా చాలా కఠినాతి కఠినమైన శిక్షలు అమలుచేస్తారు.

తాజాగా శిక్ష పడిన యువతితో పాటు మొత్తం 13 మందిని.. వాళ్లలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. అంతా 21 నుంచి 30 ఏళ్లలోపు వారే. వీళ్లందరినీ ఆ రాష్ట్ర రాజధాని బందా అసేలో ఒక మసీదు వద్ద నిలబెట్టి బెత్తంతో దెబ్బలు కొట్టారు. దాన్ని చుట్టూ ఉన్న జనం వినోదం చూస్తూ నిలబడ్డారు తప్ప.. ఎవరూ వ్యతిరేకించే ధైర్యం చేయలేదు. పెళ్లికాని యువతీ యువకులు ఒకరినొకరు ముట్టుకోవడం, కౌగలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ద్వారా వాళ్లు ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించారని తేల్చారు.

మరో వ్యక్తి అయితే.. ఒక మహిళతో కలిసి రహస్య ప్రదేశంలో గడిపినందుకు శిక్ష విధించారు. వారిలో 22 ఏళ్ల మహిళ గర్భవతి కావడంతో.. ఆమెకు తాత్కాలికంగా శిక్ష నుంచి ఊరటనిచ్చారు. అయితే, ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శిక్ష అమలుచేయాలని బందా అసె డిప్యూటీ మేయర్ జైనల్ అరిఫిన్ తెలిపారు. ఇలాంటి శిక్షలు కఠినమైనవే అయినా.. దీనివల్ల భవిష్యత్తులో ఇంకెవరూ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉంటారని అన్నారు. ఇటీవలి కాలంలో మహిళలు సహా పలువురికి ఇలా బహిరంగంగా బెత్తం దెబ్బల శిక్షలు పడుతూనే ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement