ట్రై చేయ్, బొక్కలిరుగుతయ్‌! | Sakshi
Sakshi News home page

ట్రై చేయ్, బొక్కలిరుగుతయ్‌!

Published Thu, Jun 2 2016 5:28 PM

ట్రై చేయ్, బొక్కలిరుగుతయ్‌! - Sakshi

కరాచి: ‘మమ్మల్ని కొడతారా? ట్రై చేయండి!’ అంటూ పాకిస్తాన్‌ మగవలు తమ భర్తలకు సవాల్‌ విసురుతున్నారు. భర్తలు చెప్పిన దుస్తులు ధరించకపోయినా, సెక్స్‌ కోరిక తీర్చకపోయినా భార్యలను స్వల్పంగా కొట్టే అధికారాన్ని భర్తలకు కట్టబెడుతూ పాకిస్తాన్‌లో రాజ్యాంగాధికారంగల ఇస్లాం సైద్ధాంతిక మండలి (సీఐఐ) గత వారం ఓ బిల్లును ప్రతిపాదించింది.

ఈ బిల్లుపై మహిళలు మండిపడుతున్నా బయటకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించలేక పోయారు. దీంతో వారి అభిప్రాయాల వ్యక్తీకరణకు ఓ వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఫహద్‌ రాజ్‌పర్‌ అనే ఓ ఫొటోగ్రాఫర్‌ ‘ట్రైబీటింగ్‌మీలైట్లీ’ పేరిట ఫేస్‌బుక్‌లో ఓ ఉద్యమాన్ని ప్రారంభించగా పాకిస్తాన్‌ మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

‘నన్ను కొట్టేందుకు ప్రయత్నించు. నీ బొక్కలిరక్కొడతా.....బొక్కల్లో సున్నం లేకుండా చేస్తా.....రేపు సూర్యోదయం ఎలా ఉంటుందో కూడా చూడలేవు. మక్కెలిరగకొడతా, ఏ ముల్లా వచ్చి నిన్ను రక్షించలేరు.....నా ఏడేళ్ల కారు డ్రైవింగ్‌ అనుభవాన్ని ఉపయోగించి నీ మీదుగా కారు తోలుతా.....చేయి ఎత్తితే దాన్ని ఇరక్కొట్టి అల్లాకే వదిలేస్తా.....నీ మాంసం వండుకు తింటా.....చూస్తుండు, మరుగుజ్జు అయిపోతావ్‌.....కనీసం కొట్టాలని ఆలోచించినా పక్కటెముకలు విరుగుతయ్‌...’ అంటూ పాకిస్తాన్‌ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తమ కామెంట్లతోపాటు ఫొటోలను కూడా పోస్ట్‌ చేశారు.

తీవ్రంగా స్పందించిన వారిలో డిజిటల్‌ స్టోరీ టెల్లర్‌ అదికా లాల్వాని, ట్రావెల్‌ అండ్‌ లైఫ్‌సై్టల్‌ బ్లాగర్‌ అంబర్‌ జుల్ఫికర్, డిజిటల్‌ మార్కటర్‌ ప్రియాంక ఫహూజ, సోషల్‌ మీడియా మేనేజర్‌ సుంబుల్‌ ఉస్మాన్, డాక్టర్‌ షగుఫ్తా, షంశేర్, రొహన్నే, ప్యాక్‌పిక్స్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement