ఒంటరి బామ్మకు 117 ఏళ్లు | Sakshi
Sakshi News home page

ఒంటరి బామ్మకు 117 ఏళ్లు

Published Wed, Nov 30 2016 2:24 PM

ఒంటరి బామ్మకు 117 ఏళ్లు

రోమ్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వృద్ధురాలిగా రికార్డుల్లోకి ఎక్కిన ఇటలీ బామ్మ ఎమ్మా మొరానో మంగళవారం నాడు 117వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఫియట్ కార్ల తయారీ సంస్థ ఆవిర్భవించిన తొలినాళ్లలో పుట్టిన ఈ బామ్మ మూడు శతాబ్దాలకు ప్రత్యక్ష సాక్షిగా నేడు కూడా ఆరోగ్యంగానే ఉండడం ఓ అద్భుతం. ఈ అద్భుతం వెనకనున్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే ఆమె మాత్రం తన భర్తను తన్ని తగలేసి, మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించడమేనని ముసిముసిగా చెబుతారు.
 
ఆమె ఇంతకాలం జీవించి ఉండడానికి కారణం ఆమె తీసుకుంటున్న డైటేనని ఆమెకు ఎంతో కాలంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కార్లో బావో చెప్పారు. ఆమెను తాను కలుసుకునే నాటికి ఆమె రోజు ఉదయం రెండు పచ్చి గుడ్లు తాగేదని, మధ్యాహ్నం ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినేదని, రాత్రికి చికెన్ తినేదని ఆయన తెలిపారు. యుక్త వయస్సులో ఆమె బలహీనంగా ఉన్నప్పుడు గుడ్లు బాగా తినాలని ఓ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు ఆమె గుడ్లు ఎక్కువ తినడం అలవాటు చేసుకున్నారట అని ఆయన వివరించారు.
 
ఒంటరిగా జీవించడం ఎక్కువ కాలం బతకడానికి ఒక్క కారణం మాత్రమేనని, జన్యువులు, డైట్ కూడా తన ఆరోగ్యానికి దోహదం చేశాయని ఎమ్మా శతాధిక వృద్ధురాలిగా పుట్టిన రోజులు జరుపుకున్న సందర్భంగా వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. తన తల్లి 91 ఏళ్ల వరకు, తన ఏడుగురు చెల్లెళ్లు వందేళ్లకు పైగా జీవించారని ఎమ్మా పేర్నొన్నారు. 90 ఏళ్ల వరకు పొద్దున రెండు గుడ్లు, మధ్యాహ్నం ఒక్క ఆమ్లెట్, రాత్రికి కూరగాయలు, అప్పుడప్పుడు పళ్లు తింటూ వచ్చానని ఆమె తెలిపారు. ఆ తర్వాత నుంచి రోజు ఉదయం రెండు గుడ్లు, రాత్రికి బిస్కట్లు తింటున్నానని ఆమె చెప్పారు.
 
ఆమె జీవితం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఎమ్మా మొరానో ఇటలీ పైడ్మాంట్ ప్రాంతంలో 1899, నవంబర్ 29వ తేదీన జన్మించారు ఆమె యుక్త వయసులో ఓ యువకుడిని ప్రేమించారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో ఆ యువకుడు మరణించడంతో ఆమె ఇక ఎవరిని ప్రేమించలేకపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకోలేదు. కుటుంబం బలవంతం మీద 27వ ఏట పెళ్లి చేసుకున్నారు. కానీ సంసారం అన్యోన్యంగా సాగలేదు. ఆరునెలల వయస్సులో తన మగశిశువు మరణించడంతో 1938లో భర్తకు విడాకులు ఇచ్చారు. అయితే  ఆయన 1978లో చనిపోయే వరకు విడిపోయినా ఎమ్మాతోనే కలసి జీవించారు. 1978 నుంచి ఎమ్మా పూర్తి ఒంటరిగానే జీవిస్తూ వచ్చారు. తనపై ఎవరి పెత్తనాన్ని తాను అంగీకరించనని, అందుకే ఒంటరిగా జీవించినా బాధ పడలేదని ఎమ్మా చెప్పారు.
 
ఇప్పటికీ సొంత ఫ్లాట్లోనే నివసిస్తున్న ఆమెకు ఇరుగుపొరుగు వారు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటారు. మంగళవారం 117 పుట్టిన రోజు సందర్భంగా వారంతా వచ్చి వేడుకను ఉన్నంతలో ఘనంగా జరిపించారు. ఆమె డాక్టర్ కార్లో కూడా అప్పుడప్పుడు వచ్చి యోగక్షేమాలు కనుక్కొని పోతుంటారు. బహూశా ఎమ్మా బామ్మకు మరణం లేకపోవచ్చని డాక్టర్ కార్లో వ్యాఖ్యానించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement