నివురుగప్పిన నిప్పులా వుహాన్‌ | Sakshi
Sakshi News home page

మానని గాయం.. కొనసాగుతున్న ఆంక్షలు!

Published Sat, May 2 2020 11:39 AM

Wuhan Lockdown CoronaVirus  A Lesson For The  World - Sakshi

వుహాన్.. ప్రపంచ నలమూలల పరిచయమైన ఈ పేరు వినగానే ఏదో తెలియన భయం ప్రజలను వెంటాడుతోంది. చైనాలో దాదాపు 11 మిలియన్‌ మంది జనాభా కలిగిన ఆ నగరంలోనే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పుట్టింది. ఆ ప్రాణాంతక వైరస్‌ ఎలా పుట్టిందీ? అక్కడ ఇందుకు దోహం చేసిన వాతావరణ పరిస్థితులేంటి? వంటి వివరాలేవీ నేటికీ బాహ్య ప్రపంచానికి తెలియవు. చైనా మీడియా మొత్తం ప్రభుత్వ అజమాయిషీలోనే నడుస్తున్న విషయం తెలియంది కాదు. అయితే, వాణిజ్య, వ్యాపార పరంగా అక్కడికి వెళ్లొచ్చే వారు చెబుతున్న విషయాల ఆధారంగానే అక్కడున్న పరిస్థితుల గురించి ప్రపంచానికి తెలుస్తోంది. 

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా పుట్టిన ఊరు మరి ఇప్పుడెలా ఉంది? 78 రోజుల కఠిన లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులేంటి? లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చారని, ఎత్తివేసారని వార్తలు వస్తున్నాయి. మరి ఆ సడలింపుల మేరకు వుహాన్‌ మళ్లీ సాధారణ పరిస్థితులకు చేరిందా? జన జీవనం మునుపటి వలె యథాతథంగా కొనసాగుతోందా?  ఎన్నో కర్మాగారాలు ఉన్న ఆ నగరంలో మళ్లీ పనులు మొదలయ్యాయా? ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయా? అక్కడ కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? మళ్లీ అలాంటి ప్రమాద సంకేతాలు ఏమీ లేనట్టేనా? ప్రపంచ పటంపైన గాయంగా మారిన వుహాన్‌ జనాన్ని అనుమానపు వేధింపులు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు నేటికీ నిర్భయంగా ఇంకా బయటకి రాలేకపోతున్నారు. (చైనాపై మళ్లీ కారాలు మిరియాలు)

క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా.. 
అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని వుహాన్‌లో పర్యటించిన పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. మహమ్మారి కట్టడి ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన లూవో పింగ్‌ ఏప్రిల్‌ 8న ఓ ప్రకటన చేశారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా సడలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక పట్టణంలో దాదాపు అన్ని రంగాలు 100 శాతం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయని... ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తామని.. డబుల్‌ విక్టరీ సాధిస్తామని ఏప్రిల్‌ 25న వుహాన్‌ ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రభుత్వ అజమాయిషిలో పనిచేసే మీడియా సైతం ఏప్రిల్‌ చివరి నాటికి పరిస్థితులు చక్కబడతాయని ఆశించడం సరికాదని కథనాలు వెలువరించింది.

ఇప్పటికీ అక్కడ కొన్ని స్టోర్లు ఇంకా మూతపడే ఉండటం.. కొన్ని చోట్ల ఆంక్షలు కొనసాగుతుండటం.. అతి తక్కువ సంఖ్యలో ప్రజలు బయటికి రావడం(ప్రొటెక్టివ్‌ వేర్‌ ధరించి) చూస్తుంటే కరోనా గాయం నేటికీ మానినట్లు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వుహాన్‌లో పర్యటించిన కొంతమంది వ్యాపారవేత్తలు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. మాక్వేర్‌ కాపిటల్‌ లిమిటెడ్‌ ఎకనమిస్ట్ ల్యారీ హూ మాట్లాడుతూ‌... ‘‘ఉత్పత్తి పెరిగితే వినియోగం కూడా పెరిగితేనే పరిస్థితులు చక్కబడతాయి. ఎందుకంటే చాలా మంది ప్రజలు నేటిదాకా బయటకు రావడానికి సుముఖంగా లేరు. వారిలో భయాలు తొలగిపోలేదు. ఈ పరిణామాలన్నీ వుహాన్‌పై పెను ప్రభావం చూపిస్తాయి. మూడేళ్ల వరకు వైరస్‌ ప్రభావం కొనసాగుతుంది’’ అని అభిప్రాయపడ్డారు.(వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా లీకైంది...!)

అలుపెరగని పోరాటం
సెంట్రల్‌ చైనాలోని హుబే ప్రావిన్స్‌ రాజధాని అయిన వుహాన్‌ రవాణా, పరిశ్రమల హబ్‌గా పేరొందింది. తాజా గణాంకాల ప్రకారం వుహాన్‌ జనాభా 1.11 కోట్లు. అమెరికాలోని ప్రధాన పట్టణాలతో దాదాపు రెట్టింపు జనాభా కలిగి ఉన్న వుహాన్‌ నేటికీ సెకండ్‌ టైర్‌ సిటీగా పరిగణించబడుతోంది. గతేడాది డిసెంబరు నెలాఖరున అక్కడ బయటపడిన ప్రాణాంతక వైరస్‌ క్రమంగా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనలోకి నెట్టేసింది. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం జనవరి 23 నాటికి దేశంలోని ఇతర ప్రాంతాలతో వుహాన్‌కు సరిహద్దులను మూసివేసింది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు నగరంతో ఇతర ప్రాంతాలకు ఉన్న సంబంధాలను పూర్తిగా తెంచివేసింది. దాంతో వుహాన్‌ జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ప్రజలంతా నెలల పాటు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాలకు తప్ప ఎవరూ బయటకు వెళ్లకుండా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశారు. (ఓ చైనా మహిళ ఆవేదన : ప్రపంచానికి సూటి ప్రశ్న!)

ఈ క్రమంలో ఎంత మంది పౌరులు జైలుపాలయ్యారో, మరెంత మంది చిత్రహింసలెదుర్కొన్నారో బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలియదు. అయితే వైరస్‌ను కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామనడానికి రుజువుగా జనం మూకుమ్మడిగా పరిత్యజించిన నగరంగా వుహాన్‌ ఫొటోలను చైనా విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఒక్కరోజులోనే వేలకు పైగా బయటపడ్డ కరోనా కేసులు క్రమేమీ వందలు, పదులు.. ఆఖరికి సున్నాకు చేరుకున్నాయని నిర్ధారించి.. దాదాపు 76 రోజులపాటు బందీఖానాలో పడినట్లుగా ఉన్న ప్రజలకు విముక్తి కల్పించింది. ఏప్రిల్‌  8 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. ఇక అప్పటి నుంచి.. వైరస్‌ ధాటికి కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కావాల్సిన చర్యలన్నీ చేపట్టాలని చైనా ప్రభుత్వం వుహాన్‌ అధికారులపై ఒత్తిడి పెంచింది. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనిస్తే హుబే ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి దీర్ఘకాలం పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు.(వైరస్‌ మూలాలపై గందరగోళం..)

జీడీపీ పడిపోయింది..
ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఆసియా పసిఫిక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ షౌన్‌ రోచే మాట్లాడుతూ.. ‘‘వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్ట వాటిల్లినప్పటికీ.. అంతేత్వరగా తిరిగి వ్యాపార కలాపాలను ప్రారంభించడం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావించింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా చిన్న, మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు నిర్భయంగా బయటకు రాగలిగే అవకాశాలు తక్కువ. కాబట్టి తమ లక్ష్యాలను వారు చేరుకోలేకపోవచ్చు’’అని అభిప్రాయపడ్డారు. ఇక ఏప్రిల్‌ 21న వుహాన్‌లో పర్యటించిన సీఎన్‌ఎన్‌ బృందం... సగం కంటే ఎక్కువ మంది చిరు వ్యాపారులు ఇంతవరకు తిరిగి షాపులు తెరవలేదని పేర్కొంది. ఇక లాక్‌డౌన్‌ కారణంగా 2020 మొదటి త్రైమాసికంలో హుబే జీడీపీ 40 శాతం మేర పడిపోయిందని స్థానిక షినువా తెలిపింది. కేవలం మార్చి నెలలోనే రిటేల్‌ సేల్స్‌ 15 శాతం కంటే ఎక్కువ మేర పడిపోయిందని వెల్లడించింది. 

ఇక లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు స్థానిక వ్యాపార సంస్థలు అద్దె చెల్లించకనక్కర్లేందన్న ప్రభుత్వం.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వ్యాపారం చేస్తున్న వారికి ఇలాంటి సడలింపులు ఇవ్వకపోవడం.. లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర నష్టాలు చవిచూడటంతో వారు వేరే ప్రాంతాలకు తరలివెళ్లారని మరో అంతర్జాతీయ మీడియా పేర్కొంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. చైనా ప్రభుత్వ ఆధీనంలోని గ్లోబల్‌ టైమ్స్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘‘రెండు రోజుల క్రితం రెస్టారెంట్‌ తిరిగి ప్రారంభించాను. అయినా ఒక్కరు బయటకు రావడం లేదు. రోజుకు రెండు నుంచి మూడు ఆన్‌లైన్‌ ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. అయితే రెస్టారెంట్‌ నిర్వహణకు ఖర్చు అవుతున్న మొత్తంతో పోలిస్తే.. వస్తున్న ఆదాయం చాలా తక్కువ. మళ్లీ అందుకే రెస్టారెంట్‌ మూసివేశాను’’అని ఓ రెస్టారెంట్‌ యజమాని వెల్లడించాడని పేర్కొంది.  

మరోసారి వైరస్‌ విజృంభిస్తుందనే భయంతో..
చిన్న వ్యాపారాలకు ప్రభుత్వం ఊతం ఇవ్వకపోవడం.. సహాయం అందించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో చాలా మంది స్వచ్చందంగానే షాపులు మూసివేస్తున్నారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ సెంటర్లు, సినిమా థియేటర్లు తక్షణమే తెరిచే పరిస్థితి నేటికీ కనిపించడం లేదు. ఇక స్టార్‌బక్స్‌, మెక్‌డొనాల్డ్స్‌, బర్గర్‌ కింగ్‌, కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌ వంటి మేజర్‌ ఫుడ్‌చైన్‌ సంస్థలు బిజినెస్‌ స్టైల్‌ను మార్చాయి. కస్టమర్లను లోపలికి అనుమతించకుండా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటేనే.. స్టోర్ల ప్రాంగణంలోనే టేబుళ్లు వేసి.. వారికి కావాల్సినవి సర్వ్‌ చేస్తున్నారు. చిరు వ్యాపారులకు ఈ వెసలుబాటు లేకుండా పోయింది. దీంతో వారికి నామమాత్రపు ఆదాయం కూడా రావడం లేదు. ఈ విషయం గురించి ఆర్థికవేత్త రోచే మాట్లాడుతూ... ‘‘ఏ ఆర్థిక వ్యవస్థకైనా సేవల రంగమే మూలస్థంభంగా పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటారు. ఎంతో మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. వైరస్‌ భయం వెంటాడుతున్న తరుణంలో 100 శాతం ఉత్పత్తి సాధించడం అసాధ్యం’’ అని అభిప్రాయపడ్డారు.

ఇక వైరస్‌ మరోసారి విస్తరిస్తే... రెండోసారి లాక్‌డౌన్‌ అమలు చేస్తారని... అప్పుడు ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కబడి.. వైరస్‌ను పూర్తిగా అంతంచేసిన నాడే వుహాన్‌ పూర్వవైభవం పొందుతుందని తేల్చిచెబుతున్నారు. కాగా సీఎన్‌ఎన్‌ బృందం శనివారం వుహాన్‌ను వీడిన సమయంలో అక్కడ దాదాపు 19 మందికి లక్షణాలు బయటపడకున్నా కరోనా సోకిందని తమకు సమాచారం అందినట్లు పేర్కొంది. అమెరికా సహా ఇతర దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కరోనా మరణాల గురించి చైనా ఇటీవల తాజా గణాంకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ నెలాఖరున తొలిసారి ఓ యువ డాక్టర్‌ జనవరి మొదటివారంలో ఈ వైరస్‌ జాడ గురించి జనాన్ని అప్రమత్తం చేసినప్పుడు చైనా ప్రభుత్వం కప్పెట్టే యత్నం చేయడం... గణాంకాలు మార్చి చెప్పడం చూస్తుంటే వుహాన్‌ ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉందని.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (‘వుహాన్‌’ డైరీలో నమ్మలేని నిజాలు..)

Advertisement

తప్పక చదవండి

Advertisement