కోవిడ్‌: వుహాన్‌లో జిన్‌పింగ్‌ పర్యటన! | Sakshi
Sakshi News home page

కోవిడ్‌: వుహాన్‌లో జిన్‌పింగ్‌ పర్యటన!

Published Tue, Mar 10 2020 2:10 PM

Xi Jinping Visits Wuhan Over Covid 19 Outbreak Build Confidence - Sakshi

బీజింగ్‌: మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మంగళవారం వుహాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య, సైన్యాధికారులు, కమ్యూనిటీ వర్కర్లు, పోలీసులతో ఆయన భేటీ అయ్యారు. అదే విధంగా... హౌషెన్షన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించినట్లు ప్రభుత్వ మీడియా పేర్కొంది. కాగా కరోనా వైరస్‌ భయం వెంటాడుతున్న వేళ.. ప్రజల్లో ధైర్యం నింపేందుకే ఆయన వుహాన్‌లో పర్యటించినట్లు తెలుస్తోంది. కరోనా తొలిసారిగా బయటపడిన వుహాన్‌కు వెళ్లడం ద్వారా దేశంలో తలెత్తిన విపత్కర పరిస్థితులు సాధారణ స్థితికి చేరకున్నాయనే సంకేతాలు ఇవ్వడంతో పాటుగా... కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా కరోనా వ్యాప్తి చెందిన తర్వాత ఆయన వుహాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.(ఓ చైనా మహిళ ఆవేదన : ప్రపంచానికి సూటి ప్రశ్న!)

ఇక ప్రపంచ దేశాల అధినేతలకు పెనుసవాలుగా పరిణమించిన కరోనా వైరస్‌ తొలిసారిగా చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడిన విషయం తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్‌ ధాటికి ఇప్పటిదాకా చైనాలో 3,136 మందికి పైగా మరణించగా... లక్షలాది మంది దాని బారిన పడి క్వారంటైన్‌లో వేదన అనుభవిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చైనాలో ఈ వైరస్‌ తగ్గుముఖం పడుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో చైనాలో దేశ వ్యాప్తంగా 19 మంది కరోనా కేసులు నమోదుకాగా.. 17 మరణాలు సంభవించాయని ప్రభుత్వ మీడియా మంగళవారం పేర్కొంది. అదే విధంగా వుహాన్‌లో కేవలం 2 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నయోదయ్యాయని తెలిపింది. కరోనా కారణంగా వుహాన్‌లో విధించిన ఆంక్షలను సడలిస్తున్నట్లు పేర్కొంది. (‘కోవిడ్‌’పై ట్రంప్‌ ట్వీట్‌.. కీలక నిర్ణయం!)

Advertisement
Advertisement