దళారుల దందా! | Sakshi
Sakshi News home page

దళారుల దందా!

Published Tue, Jan 30 2018 7:28 PM

mediators troubling the golla kurmas - Sakshi

‘పక్క చిత్రం జగిత్యాల మండలం బాలపెల్లి గ్రామంలో పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలది. ఈ గ్రామంలో మొత్తం 89 యూనిట్లను మంజూరు చేసిన అధికారులు నెలక్రితం 27 మంది లబ్ధిదారులను తమవెంట గుంటూరు జిల్లా మాచర్లకు తీసుకెళ్లి గొర్రెలు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఒక్కో గొర్రెపిల్ల వయస్సు ఏడాది ఉండాలి. కానీ ఈ లబ్ధిదారుల్లో దాదాపు అందరికీ సగం నెల, రెండునెలల వయస్సున గొర్రె పిల్లలు, మిగిలిన సగం పెద్ద జీవాలు అందాయి. ప్రతి యూనిట్‌లో ఓ పొట్టెలు కచ్చితంగా ఉండాలి.

కానీ 17 యూనిట్లకు కూడా ఒక్కపొట్టెలూ లేకుండానే గొర్రెలు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇచ్చిన గొర్రెలు కూడా ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక పంపిణీ చేసినవాటిలో చాలావరకు చనిపోయాయి. చెట్టె కొమురెల్లి, గుంటి పోశవ్వకు చెందిన రెండు యూనిట్లలో పది గొర్రె పిల్లలు చనిపోయాయి. వీరిద్దరు ఎక్కువగా నష్టపోయారు. అంతేకాదు.. మరో 20 యూనిట్లకు సంబంధించిన డీడీలు లబ్ధిదారుల వద్ద ఉన్నాయి. వారికి ఇంకా జీవాలు పంపిణీ కాలేదు..’ 

‘కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్‌కు చెందిన పలువురు గొల్లకుర్మలు గతేడాది నవంబర్‌లో ఓ పశువైద్యాధికారితో కలిసి ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లారు. అక్కడ పశువైద్యాధికారి చూపించిన గొర్రెలు బలహీనంగా ఉండడంతో వాటిని తీసుకోబోమని తేల్చిచెప్పారు. దీంతో సదరు వైద్యుడు వారిని అక్కడే వదిలేసి నాలుగు రోజులపాటు మాయమయ్యాడు. చివరకు లబ్ధిదారులు నేరుగా ఓ ప్రజాప్రతినిధికి ఫోన్‌ చేసి విషయాన్ని వివరించారు. ఆయన జిల్లా అధికారులకు సమాచారమిచ్చి మరో వైద్యుడిని అక్కడికి పంపగా.. లబ్ధిదారులను తిరిగి తీసుకొచ్చాడు. అదే నెలాఖరులో మళ్లీ కనిగిరి వెళ్లిన లబ్ధిదారులు తమకు నచ్చిన గొర్రెలు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. పై రెండు ఉదాహరణలు చాలు.. జిల్లాలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలు తీరును బేరీజు వేసేందుకు.


సాక్షి, జగిత్యాల : అధికారుల వైఫల్యంతో సబ్సిడీ గొర్రెల పథకం జిల్లాలో అభాసుపాలైంది. పథకం అమలులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పథకం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జీవాలు ఇప్పించడంలో క్యాష్‌ టీం.. (లబ్ధిదారుల వెంట వెళ్లిన పశువైద్యులు), దళారులు కలిసి అవినీతికి పాల్పడినట్టు లబ్ధిదారులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నా రు. తమ గొర్రెలు విక్రయించినందుకుగానూ విక్రయదారుల వారినుంచి రూ.5వేల వరకు లంచం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. అక్కడి పరిస్థితుల గురించి ఏమీ తెలియ ని తమను ఎటూ వెళ్లనీయకుండా చేసి వారికి నచ్చిన గొర్రెలు మాత్రమే చూపించి వాటిని మాత్రమే ఇప్పించారని బాధితులు వాపోతున్నారు.

నిబంధనల ప్రకారం సబ్సిడీ మీద అందించే జీవాలు ఏడాది నిండి ఉండాలి. కానీ నెల, రెండు నెలలున్న గొర్రెల పిల్లలు, పొట్టేలు లేకుండా లబ్ధిదారులకు అంటగట్టడం పశువైద్యాధికారులకే చెల్లింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం అనుకూలించక వందల సంఖ్యలో గొర్రెల పిల్లలు చనిపోయాయి. దీంతో గొల్లకుర్మలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. మరోపక్క.. పక్క రాష్ట్రంలోని జిల్లాలకు లబ్ధిదారులను తీసుకెళ్లిన పశువైద్యాధికారులు వారు చూపించిన గొర్రెలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. జీవాలు బలహీనంగా ఉన్నా.. తమకు నచ్చకున్నా వాటినే తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేక సబ్సిడీ రూపంలో వచ్చిన గొర్రెలను కాదనకుండా జీవాలను తమ వెంట తీసుకొచ్చామని చెప్తున్నారు.

ఉద్దేశమొకటి.. జరుగుతున్నదొకటి..
చితికిపోతున్న గొల్లకుర్మ కుటుంబాలకు చేయూతనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకాన్ని ప్రారంభించింది. గతేడాది ఏడాది ఏప్రిల్‌ 18న పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో లబ్ధిదారులతో కలిసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు పర్యటించిన పశువైద్యాధికారులు జిల్లా వాతావరణాన్ని తట్టుకుని జీవించేలా అనువుగా ఉండే గొర్రెలను కొనుగోలు చేశారు. మహారాష్ట్ర జీవాలపై లబ్ధిదారులు అనాసక్తి చూపడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా వినుగొండ, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, నెల్లూరు జిల్లా ఉదయగిరి, ప్రకాశం జిల్లా పామూరు, కనిగిరి ప్రాంతాల నుంచి గొర్రెల ను కొనుగోలు చేసి జిల్లాలో గొల్లకుర్మలకు అప్పగించారు.

ఒక్కొ యూనిట్‌కు రూ.1.25 లక్షల చొప్పున ఇప్పటి వరకు 9,739 యూని ట్లు లబ్ధిదారులకు అందించారు. ఒక్కో యూని ట్‌కు ఇరవై గొర్రెలు.. ఒక పొట్టెలు చొప్పున ఇచ్చారు. ప్రతి యూనిట్‌కు సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.93,750 (75 శాతం) చొప్పున రూ.31 కోట్ల పైచిలుకు ఖర్చు చేసింది. మిగిలిన రూ.31,250 (25శాతం) లబ్ధిదారులు భరించారు. దీంతో పాటు ప్రతి జీవిపై ఏడాదిపాటు ఇన్సురెన్స్‌ చెల్లించారు. ఆ లోపు గొర్రె, పొట్టే చనిపోతే దానిస్థానంలో మరో జీవిని ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు గొర్రెలు ఇప్పించడంలో అధికారులు విఫలమయ్యారు. నిర్ణయించిన లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
అలాంటిదేమీ లేదు
లబ్ధిదారుల ఇష్టం మేరకే సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశాం. ఇష్టం లేని ఎంతోమంది జీవాలు లేకుండానే తిరిగొచ్చారు. మరోసారి వారిని తీసుకెళ్లి ఇష్టం మేరకు జీవాలు ఇప్పించాం. గొర్రెలు ఇప్పించడంలో దళారుల ప్రమేయం లేదు. పొట్టేలు తక్కువగా ఉండడంతో పలు యూనిట్లకు ఇవ్వలేకపోయాం.
-అశోక్‌రాజు, జిల్లా పశువైద్యాధికారి

చిన్నపిల్లలు కొనిచ్చారు
గొర్రెల పథకంలో లబ్ధిదారులు ఏరుకున్న గొర్రెలు కాకుండా  నచ్చలేదని చెప్పినా వినకుండా 10 పెద్దవి, 11 చిన్న గొర్రెలు కొనిచ్చారు. ఇప్పటికే మూడు పిల్లలు చనిపోయాయి. అధికారులు చిన్న గొర్రెపిల్లలు వద్దని చెప్పినా పట్టించుకోకుండా కొనిచ్చారు.
– చెట్టె బుచ్చయ్య, బాలపల్లి

పొట్టేలు లేకుండానే
ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసి ఇచ్చారు. 10 పెద్ద గొర్రెలు, 10 చిన్న పిల్లలు ఇచ్చారు. గొర్రెలు నచ్చలేదని చెప్పినా పట్టించుకోలేదు. ఇక్కడకు వచ్చేలోపు పిల్లలు చనిపోయాయి. నెల్లూరు జిల్లా మాచర్ల, కుంటాల ప్రాంతాల్లో వారే గొర్రెలను చూసి కొనుగోలు చేసి ఇచ్చారు.               
 – ఏగుర్ల రెడ్డి, బాలపల్లి

మేం చూసినవి వద్దన్నరు
కర్నూలు గొర్రెలు బాగున్నాయి. అధికారులు కుదరవని, కుంటకు తీసుకెళ్లారు. చిన్నవి సగం, పెద్దవి సగం కొనివ్వడంతో కొంత మంది మి విధిలేక తీసుకున్నాం. కొంతమంది వాపస్‌ వచ్చారు. 20 యూనిట్ల లబ్ధిదారులు గొర్రెలు తీసుకోలేదు. 
– చెట్టె కొమురయ్య, బాలపల్లి

Advertisement
Advertisement